BREAKING
నేటి రాశి ఫలాలు: 5 అక్టోబర్ 2026, సోమవారం నేటి పంచాంగం: 5 అక్టోబర్ 2026, సోమవారం. 'జియోనిజం ఒక జాతి వివక్ష' అంటూ బ్రిటన్ గ్రీన్ పార్టీ తీర్మానం టెర్మినల్ టు యానం..అంతా మాఫియా ఈ నెల 5న ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఇరాన్ చమురు మంత్రి మొహ్సిన్ పాక్నెజాద్ రాజీనామా 'స్పేస్‌ఎక్స్ ఏఐ' పేరును 'స్పేస్‌ఎక్స్ ఎస్ఐ'గా మార్చనున్న ఎలన్ మస్క్ గణపతి నిమజ్జన కార్యక్రమంలో లడ్డూ వేలం పాటలో పాల్గొన్న బొడ్డేటి కిరణ్ కుమార్.. సొంత గడ్డపై సత్తా చాటిన గుడిలోవ విద్యార్థులు... విజ్ఞాన్ గ్రాండ్ ఫిక్స్ - సెషన్ 1లో ప్రతిష్టాత్మక అవార్డులు...... రష్యా ఆక్రమిత ఒలేష్కీలో డ్రోన్ల ద్వారా ఆహార సరఫరా వైద్యులు నిర్లక్ష్యం వల్ల పాప చనిపోయిందని బంధువుల ఆందోళన.. దుర్గాదేవి నవరాత్రులకు ముహూర్తపు రాట బాలల హక్కుల పరిరక్షణపై కమిషన్ సభ్యురాలి పర్యటన అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో మహిళ ఆత్మహత్య

టెర్మినల్ టు యానం..అంతా మాఫియా

Select Suryaa Now
టెర్మినల్ టు యానం..అంతా మాఫియా

*టెర్మినల్‌ టు యానాం...*

*అంతా మాఫియా!*

* గ్రీన్‌ డేరాల్లో చౌర్యం.. కొందరు డీలర్ల డైవర్షన్‌

* యానాం చేరకముందే ఏపీలో అక్రమ పాయింట్ల వద్ద సరకు మళ్లింపు

* బంకులో దించిన తర్వాతా భారీ ట్యాంకుల్లోకి తరలిస్తున్నారన్న సమాచారం

* ఈ-లాక్‌.. జీపీఎస్‌ నిఘా ఉన్నా ఆగని అక్రమ రవాణా

* డీలర్లపై కంపెనీల పర్యవేక్షణ ఉన్నా వరుసగా బయటపడుతున్న వ్యవహారాలు

* సేల్స్‌ అధికారుల క్షేత్రస్థాయి నిఘాపై పెట్రోలియం డీలర్ల సంఘం విమర్శలు

* ధర వ్యత్యాసమే దందాకు ఊతం.. రాష్ట్ర VAT ఆదాయంపైనా ప్రభావం


టెర్మినల్‌లో ట్యాంకర్‌ నిండుతుంది. ఈ-లాక్‌ పడుతుంది. జీపీఎస్‌ నిఘా మొదలవుతుంది. గమ్యం యానాం. మధ్యలో గ్రీన్‌ డేరా వద్ద ట్యాంకర్‌ ఆగితే వాల్వ్‌లు తెరుచుకుంటున్నాయి. కొన్ని సందర్భాల్లో యానాం డీలర్‌ పేరుతో బయలుదేరిన డీజిల్‌ గమ్యం చేరకుండానే ఏపీలో పక్కదారి పడుతోందన్న ఆరోపణలు కేసుల వరకు వెళ్లాయి. మరోవైపు బంకులో ఇంధనం దించిన తర్వాత డిస్పెన్సర్‌ గన్ల ద్వారానే భారీ ట్యాంకుల్లో నింపి బయటకు తరలిస్తున్నారన్న సమాచారం వస్తోంది. ట్యాంకర్‌పై నిఘా ఉంది. డీలర్‌పై కంపెనీ పర్యవేక్షణ ఉంది. క్షేత్రస్థాయిలో సేల్స్‌ అధికారులు ఉన్నారు. అయినా టెర్మినల్‌ నుంచి యానాం వరకు ఎక్కడో ఒకచోట డీజిల్‌కు పక్కదారి తెరుచుకుంటూనే ఉంది. ‘యానాం డీజిల్‌ మాఫియా సవాల్‌!’ తర్వాత మరింత లోతుగా వెళ్లిన ఉమ్మడి గోదావరి జిల్లాల ‘సూర్య’ బ్యూరో పరిశీలనలో బయటపడుతున్న వ్యవహారాలివి.

ఉమ్మడి గోదావరి జిల్లాల సూర్య బ్యూరో

యానాం పేరుతో జరుగుతున్న ఇంధన మళ్లింపుపై ‘సూర్య’ ఆరా మరింత లోతుకు వెళ్లింది. టెర్మినల్‌ నుంచి బయలుదేరిన ట్యాంకర్‌ యానాం బంకుకు చేరేలోపు ఉన్న దారి.. బంకులో సరకు దించిన తర్వాత జరిగే అమ్మకాలు.. వీటిపై ఉండాల్సిన కంపెనీ పర్యవేక్షణను కలిపి చూస్తే మొత్తం వ్యవస్థ పనితీరుపైనే అనుమానాలు తలెత్తుతున్నాయి.

*డేరా తలుపు తడితే!*

తుని నుంచి ప్రత్తిపాడు వరకు జాతీయ రహదారి వెంబడి రమారమి 80 వరకు గ్రీన్‌ డేరాలు ఉన్నట్లు క్షేత్ర పరిశీలనలో వెల్లడైంది. ట్యాంకర్లను వీటి వద్ద నిలిపి నాలుగు కంపార్ట్‌మెంట్ల నుంచి ఇంధనాన్ని క్యాన్లలోకి దొబ్బేస్తున్నారు. ఓ ట్యాంకర్‌ వద్ద వాల్వ్‌ బాక్స్‌ తెరిచి ఇంధనాన్ని సేకరిస్తున్న దృశ్యాలనూ ‘సూర్య’ క్షేత్రస్థాయిలో రికార్డు చేసింది. జాతీయ రహదారిపై ఇంత బహిరంగంగా చౌర్యం సాగుతున్నా సంబంధిత శాఖల పర్యవేక్షణకు చిక్కకపోవడం గమనార్హం.

*యానాం చేరకుండానే..*

యానాం డీలర్ల పేరుతో బయలుదేరిన ఇంధనం గమ్యం చేరకముందే ఏపీలోని అక్రమ పాయింట్ల వద్ద దింపుతున్నారన్న ఆరోపణలు గతంలోనూ వచ్చాయి. కొన్ని వ్యవహారాలు కేసుల వరకు వెళ్లాయి. ట్యాంకర్‌ బయలుదేరినప్పటి నుంచి గమ్యం చేరే వరకు జీపీఎస్‌, ఈ-లాక్‌ వంటి పర్యవేక్షణ ఉందని చమురు సంస్థలు చెబుతున్నా.. మధ్యలో సరకు మళ్లింపు ఆరోపణలు రావడమే నిఘా వ్యవస్థ పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.

*బంకులో దించిన తర్వాతా.. మరో దారి!*

మరోవైపు కంపెనీ నుంచి యానాం బంకుకు వచ్చిన ఇంధనాన్ని బంకులోని నిల్వ ట్యాంకుల్లో దించిన తర్వాత, డిస్పెన్సర్‌ గన్ల ద్వారానే భారీ ట్యాంకుల్లో నింపి తిరిగి బయటకు తరలించి విక్రయిస్తున్నారన్న సమాచారం ‘సూర్య’కు అందుతోంది. ఈ తరహా బల్క్‌ తరలింపులపై పలు సంఘాలు ‘సూర్య’కు సమాచారం అందిస్తున్నాయి. ఈ అంశానికి సంబంధించిన క్షేత్రస్థాయి ఆధారాలపై ఆరా కొనసాగుతోంది.

*మూడు నిమిషాల్లో 1,972 లీటర్లు!*

బంకుల నుంచి భారీ పరిమాణంలో ఇంధనం బయటకు వెళ్తోందన్న ఆరోపణల నేపథ్యంలో గతంలో హైకోర్టు వరకు వెళ్లిన వ్యవహారం ప్రాధాన్యం సంతరించుకుంటోంది.  డబ్ల్యూ పి (ఫిల్ )154/2023 విచారణలో ఒక బంకులో కేవలం మూడు నిమిషాల్లో 1,972 లీటర్ల అమ్మకం నమోదైందంటూ పిటిషనర్‌ ఆధారపడ్డ నివేదిక కోర్టు ముందుకు వచ్చింది. బంకుల్లో గుర్తించిన తేడాలపై షోకాజ్‌ నోటీసులు ఇచ్చినట్లు చమురు సంస్థలు కూడా కోర్టుకు తెలిపాయి.

యానాంలో ప్రతిపాదించిన 11 కొత్త రిటైల్‌ అవుట్‌లెట్ల ప్రక్రియపై అప్పట్లో న్యాయస్థానం మధ్యంతర ఆదేశాలు ఇచ్చింది. అయితే CBI/SIT దర్యాప్తు అవసరం లేదని పేర్కొంటూ 2025 మేలో హైకోర్టు పిల్‌ను ముగించింది. పిటిషనర్‌ చేసిన ఆరోపణలను కోర్టు నిర్ధారించిన అంశాలుగా చూడలేం. అయితే కంపెనీలు షోకాజ్‌ నోటీసులు ఇచ్చినట్లు కోర్టు రికార్డులోకి రావడం డీలర్లపై పర్యవేక్షణ ఎంత కీలకమో స్పష్టం చేస్తోంది.

*డీలర్‌కు దారి ఎక్కడ?*

కంపెనీ నుంచి సరకు బయలుదేరిన దగ్గర నుంచి బంకులో దించే వరకు ట్యాంకర్‌పై నిఘా ఉందని చెబుతున్నారు. బంకు కార్యకలాపాలను పరిశీలించేందుకు కంపెనీలకు ప్రత్యేక వ్యవస్థ ఉంది. తనిఖీలు చేస్తారు. తేడాలు గుర్తిస్తే నోటీసులు ఇస్తారు. అవసరమైతే చర్యలూ తీసుకుంటారు.

అయినా యానాం డీలర్ల పేరుతో ఇంధనం మళ్లించిన వ్యవహారాలు కేసుల వరకు వెళ్తున్నాయి. ఇప్పుడు బంకులో ఇంధనం దించిన తర్వాత కూడా భారీగా బయటకు తరలిస్తున్నారన్న సమాచారం వస్తోంది. ఇంత పర్యవేక్షణ మధ్య అక్రమాలకు దారి ఎక్కడ తెరుచుకుంటోందన్నదే ఇప్పుడు తేలాల్సిన అంశం.

*సేల్స్‌ ఆఫీసర్‌ పాత్రేమిటి?*

యానాం బంకులకు కేటాయించిన ఇంధనం అక్కడికే చేరి అమ్ముడయ్యేలా కంపెనీల నిఘా వ్యవస్థ పనిచేయాలి. ట్యాంకర్లపై జీపీఎస్‌, ఈ-లాక్‌ నిఘాతో పాటు డీలర్ల కార్యకలాపాలను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించడంలో సేల్స్‌ అధికారుల పాత్ర కీలకం.

యానాం ఇంధనం ఏపీలోకి మళ్లకుండా గట్టి నిఘా పెట్టాల్సిన సేల్స్‌ అధికారులు ఆ దిశగా అవసరమైన చర్యలు తీసుకోవడం లేదని ఏపీ పెట్రోలియం డీలర్ల సంఘం విమర్శిస్తోంది. వరుసగా మళ్లింపు వ్యవహారాలు బయటపడుతున్నా అక్రమాలకు అడ్డుకట్ట పడకపోవడంతో వారి పర్యవేక్షణపైనా విమర్శలు వినిపిస్తున్నాయి.

*ధర తేడానే దందాకు ఊతం*

ఏపీతో పోలిస్తే యానాంలో ఇంధన ధర తక్కువగా ఉండటం మళ్లింపునకు ప్రధాన ఆకర్షణగా మారుతోందని పెట్రోలియం వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ఈ ధర వ్యత్యాసాన్ని ఆసరాగా చేసుకొని యానాం ఇంధనాన్ని ఏపీలోకి మళ్లిస్తే భారీగా సొమ్ము చేసుకునే అవకాశం ఏర్పడుతోందన్నది వారి వాదన. ఇంధన మళ్లింపులతో రాష్ట్ర వ్యాట్ సెస్స్ ఆదాయంపైనా భారీ ప్రభావం పడుతోందని ఏపీ పెట్రోలియం వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి.

*టెర్మినల్‌ నుంచి యానాం వరకు..*

ఒకవైపు హైవేపై గ్రీన్‌ డేరాల మాటున ఇంధన చౌర్యం. మరోవైపు యానాం చేరాల్సిన డీజిల్‌ను మధ్యలోనే మళ్లిస్తున్నారన్న ఆరోపణలు. ఇంకోవైపు బంకులో ఇంధనం దించిన తర్వాత కూడా భారీగా బయటకు తరలిస్తున్నారన్న సమాచారం. గతంలో డీలర్లకు షోకాజ్‌ నోటీసులు ఇచ్చినట్లు కంపెనీలే కోర్టుకు తెలిపాయి.

ట్యాంకర్‌కు ఈ-లాక్‌ ఉంది. జీపీఎస్‌ నిఘా ఉంది. డీలర్‌పై కంపెనీ పర్యవేక్షణ ఉంది. క్షేత్రస్థాయిలో సేల్స్‌ అధికారులు ఉన్నారు. అయినా టెర్మినల్‌ నుంచి యానాం వరకు డీజిల్‌ పక్కదారి పడుతున్న వ్యవహారాలు ఎందుకు ఆగడం లేదన్నది నిగ్గుతేలాలి. ప్రభుత్వ నిఘా వ్యవస్థలు నిజాయితీగా రంగంలోకి దిగి ఈ మొత్తం సరఫరా వ్యవస్థను పరిశీలించాలని ఏపీ పెట్రోలియం డీలర్ల సంఘం కోరుతోంది.

యానాం డీజిల్‌పై మీ వద్ద ఆధారాలున్నాయా?

యానాం ఇంధన మళ్లింపు, ట్యాంకర్ల దారి మళ్లింపు, అక్రమ నిల్వలు, బల్క్‌ విక్రయాలు, సంబంధిత వ్యవహారాలపై విలువైన సమాచారం ఉన్నవారు ‘సూర్య’ ఇన్వెస్టిగేషన్‌ బ్యూరోకు 9032209779 నంబరులో అందించవచ్చు. సమాచారం అందించిన వారి వివరాలు అత్యంత గోప్యంగా ఉంచుతాం. అది మా హామీ.