‘తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్’కు తరలిరండి
హైదరాబాద్ / తెలంగాణ బ్యూరో:రాష్ట్ర ప్రభుత్వం ‘తెలంగాణ రైజింగ్ - 2047’ విజన్కు అనుగుణంగా డిసెంబర్ 7 నుంచి 9 వరకు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న ‘తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ 2026’లో పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, ఆవిష్కర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కోరారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి ‘రైజింగ్ తెలంగాణ’ లక్ష్య సాధనలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. సమాఖ్య ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ‘సమాఖ్య గ్లోబల్ బిజినెస్ మీట్ – 2026’కు గౌరవ అతిథిగా హాజరైన సందర్భంగా ఆయన మాట్లాడారు.
మంత్రి ప్రసంగంలోని ముఖ్య్యాంశాలు:
* 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యం: 2047 నాటికి తెలంగాణ ఆర్థిక వ్యవస్థను 3 ట్రిలియన్ డాలర్లకు చేర్చాలనే పట్టుదలతో ప్రభుత్వం పనిచేస్తోందని, ఇందుకోసం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పరిశ్రమలకు ప్రోత్సాహం, వ్యాపార అనుకూల వాతావరణం కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు.
* కీలక రంగాలకు ప్రాధాన్యత: హైదరాబాద్లో ఐటీ, సాంకేతిక రంగాల విస్తరణతో పాటు ఇతర జిల్లాల్లో తయారీ రంగం, వ్యవసాయ ఆధారిత పరిశ్రమల ఏర్పాటును ప్రత్యేకంగా ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్లతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఏరోస్పేస్, రక్షణ రంగం, అధునాతన తయారీ (Advanced Manufacturing) రంగాలకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని వివరించారు.
దేశ ఆర్థికాభివృద్ధిలో తెలంగాణను కీలక భాగస్వామిగా నిలిపేందుకు నూతన సాంకేతికతలు, ఆవిష్కరణలను ఆహ్వానిస్తున్నామని చెప్పిన మంత్రి శ్రీధర్ బాబు.. పెట్టుబడుల విస్తరణకు ‘తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్’ ఒక గొప్ప వేదిక కానుందని, ఈ అవకాశాన్ని పారిశ్రామికవేత్తలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.