మూలా నక్షత్రం రోజున అన్ని క్యూలైన్లలో ఉచిత దర్శనం
ఇంద్రకీలాద్రి మేజర్ న్యూస్ : దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఈ నెల 16వ తేదీ శుక్రవారం మూలా నక్షత్రం రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత కనకదుర్గ అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. అమ్మవారి జన్మనక్షత్రమైన మూలా నక్షత్రం సందర్భంగా సరస్వతీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ పవిత్రమైన రోజున లక్షలాదిగా తరలివచ్చే సామాన్య భక్తులకు ప్రాధాన్యతనిస్తూ అన్ని క్యూలైన్లలో పూర్తిగా ఉచిత దర్శనం కల్పించాలని దేవస్థానం నిర్ణయించింది. భక్తులు ఎలాంటి ఆటంకాలు లేకుండా త్వరితగతిన అమ్మవారిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు దేవదాయ శాఖ కమిషనర్ కె. రామచంద్రమోహన్, ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్ సంయుక్తంగా ప్రకటించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నెల 16వ తేదీన అన్ని రకాల అంతరాలయ దర్శనాలతో పాటు ప్రోటోకాల్, సిఫార్సు దర్శనాలను పూర్తిగా రద్దు చేసినట్లు తెలిపారు. భక్తులందరికీ ముఖమండపం నుంచే సరస్వతీ దేవి అలంకార దర్శనం కల్పించనున్నట్లు వెల్లడించారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా మూలా నక్షత్రం రోజున కొండపైకి ప్రైవేటు వాహనాలను అనుమతించబోమని స్పష్టం చేశారు. ఇప్పటికే జారీ చేసిన అన్ని రకాల వాహన అనుమతి పత్రాలను, సేవా వాహన అనుమతులతో సహా తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు తెలిపారు. అత్యవసర విధుల్లో ఉండే అధికారిక వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుందని పేర్కొన్నారు. సామాన్య భక్తుల సౌకర్యార్థం దేవస్థానం తీసుకున్న నిర్ణయాలకు ప్రముఖులు, భక్తులు సహకరించాలని, క్రమశిక్షణతో ప్రశాంత వాతావరణంలో సరస్వతీ దేవి రూపంలో దర్శనమిచ్చే జగన్మాతను దర్శించుకోవాలని దేవస్థానం విజ్ఞప్తి చేసింది.