బాలికలు శక్తివంతంగా తయారు కావాలి -- నారాయణపేట సీనియర్ సివిల్ జడ్జి వింధ్య నాయక్
నారాయణపేట, సూర్యన్యూస్:
బాలికలు సమాజంలో ఎంతో శక్తివంతంగా తయారు కావాలని జిల్లా లీగల్ సర్వీసెస్ సంస్థ సెక్రటరీ, సీనియర్ సివిల్ జడ్జి వింధ్య నాయక్ అన్నారు. నారాయణపేట పట్టణంలోని చిల్డ్రన్స్ హోమ్ లో జిల్లా న్యాయ సేవ సంస్థ లీగల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బాలికలు ఎంతో శక్తివంతంగా తయారు కావాలని, వారి హక్కులను సొంతంగా సాధించుకునే స్థాయికి ఎదగాలన్నారు. ప్రతి బాలికకు అన్ని అంశాలు నేర్చుకోవాలని, సురక్షితమైన, సంతోషకరమైన జీవితాన్ని గడపడానికి అవసరమైన అవకాశాలను సృష్టించుకోవాలన్నారు. ఈ ఒక్క విషయంలో నిరుత్సాహ పడకుండా బలవంతులుగా ఎదగాలన్నారు. లింగ విభేదాలు లేకుండా పురుషులకు సమానంగా మహిళలు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. చట్టాలు అనేక రకాలుగా రక్షణ కల్పిస్తుందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. చదువు దగ్గర నుంచి ఉద్యోగం తదితర అన్ని విషయాల్లో రిజర్వేషన్ లను రాజ్యాంగం కల్పించిందని, హక్కుగా వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం విద్యా, సమానత్వం, సంరక్షణ మరియు రక్షణ పొందే హక్కులపై వివరించారు. ఉచిత సహాయం కోసం చైల్డ్ లైన్ 1098 కు కాల్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి రాజేందర్ గౌడ్ , లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కె. లక్ష్మిపతి గౌడ్, మీనాక్షి, హసీనా బేగం సిడిపిఓ, శివలీల చిల్డ్రన్స్ హోమ్ సిబ్బంది పాల్గొన్నారు.
-- రాజేష్ కుమార్, సూర్య రిపోర్టర్ నారాయణపేట