స్థానిక ఎన్నికల నేపథ్యంలో కేతవరంలో పోలీసుల అవగాహన సదస్సు
జంగారెడ్డిగూడెం-మేజర్ న్యూస్ స్థానిక సంస్థల ఎన్నికలను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీస్ శాఖ గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా జంగారెడ్డిగూడెం ఇన్స్పెక్టర్ ఎం.వి. సుభాష్, ఎస్సై వీరప్రసాద్, పోలీస్ సిబ్బంది కేతవరం గ్రామంలో ఎన్నికల అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో కీలకమని, గ్రామస్థులు, యువత ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా తమ ఓటు హక్కును స్వేచ్ఛగా, నిర్భయంగా వినియోగించుకోవాలని సూచించారు. ఎన్నికల సమయంలో గ్రామంలో శాంతిభద్రతలకు భంగం కలిగించేలా ప్రవర్తించినా, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఎవరైనా అసాంఘిక శక్తులు లేదా ఇతర వ్యక్తులు ప్రలోభాలకు గురిచేసినా, ఎన్నికలకు సంబంధించి బెదిరింపులకు పాల్పడినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ఎన్నికల నియమావళిని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటిస్తూ, ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగేలా పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు. ఎన్నికలు ఎలాంటి గొడవలు, అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రశాంతంగా జరిగేలా సహకరిస్తామని గ్రామ పెద్దలు, ప్రజలు పోలీసులకు హామీ ఇచ్చారు.