పాలపిట్టలను పట్టుకుంటే కఠిన చర్యలు.. జిల్లా అటవీ శాఖ అధికారి విశాల్ బత్తుల హెచ్చరిక
వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్: దసరా పండుగ సందర్భంగా పాలపిట్ట పక్షులను పట్టుకున్నా, వాటిని విక్రయించేందుకు ప్రయత్నించినా కఠిన చర్యలు తీసుకుంటామని వికారాబాద్ జిల్లా అటవీ శాఖ అధికారి విశాల్ బత్తుల హెచ్చరించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దసరా పండుగ సెంటిమెంట్ పేరుతో పాలపిట్టలను పట్టుకొని వ్యాపారం చేయడం చట్టవిరుద్ధమని స్పష్టం చేశారు. పక్షుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, సంప్రదాయాల పేరుతో వన్యప్రాణులకు హాని కలిగించవద్దని సూచించారు. ఎవరైనా పాలపిట్టలను పట్టుకున్నట్లు లేదా వాటి విక్రయాలకు పాల్పడుతున్నట్లు గుర్తిస్తే వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాలని కోరారు. పక్షుల సంరక్షణకు ప్రజలందరూ సహకరించాలని విశాల్ బత్తుల విజ్ఞప్తి చేశారు.