మెరైన్ కంపెనీ కాలుష్యంతో చేపల మృతి -- పరిశీలించిన కాలుష్య నియంత్రణ మండలి ఈఈ రామచంద్రమూర్తి
నరసాపురం, మేజర్ న్యూస్:స్థానిక మెరైన్ కంపెనీ విడుదల చేసిన కాలుష్య నీరు కారణంగా భారీ సంఖ్యలో చేపలు చనిపోవడంపై ఉభయ గోదావరి జిల్లాల మత్స్యకార సహకార సంఘాల అధ్యక్షులు మైల వసంతరావు కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు ఫిర్యాదు చేశారు. మత్స్యకారుల విజ్ఞప్తిపై తక్షణమే స్పందించిన పశ్చిమగోదావరి జిల్లా పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రామచంద్రమూర్తి బుధవారం గోదావరి పరివాహక ప్రాంతంలో పర్యటించి పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ పర్యటనలో భాగంగా చనిపోయిన చేపలను, కాలుష్య నీరు చేరుతున్న ప్రాంతాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఈఈ రామచంద్రమూర్తి మీడియాతో మాట్లాడుతూఈ ఘటనపై తీవ్రంగా స్పందిస్తున్నామని, సంబంధిత పర్యావరణ అధికారులు, జిల్లా కలెక్టర్తో మాట్లాడతామని ఆయన
తెలిపారు.
కాలుష్య తీవ్రతను, చేపల మృతికి గల ఖచ్చితమైన కారణాలను నిర్ధారించడానికి నీటి నమూనాలను సేకరించి ల్యాబ్ పరీక్షలకు పంపుతామని ఈ ఈ తెలిపారు.ఈ పరీక్షల నివేదిక అందిన వెంటనే పూర్తి వివరాలను వెల్లడించి, కాలుష్యానికి కారణమైన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. మత్స్యకారుల ప్రయోజనాలను కాపాడటానికి అధికారులు కట్టుబడి ఉన్నారని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మత్స్యకార నాయకులు తిరుమణి నాగరాజు, సుబ్బారావు, వై దాని బండి రాజు,గంధం మారేసు, పొన్నపల్లి గ్రామ ప్రజలు మత్స్యకారులు పాల్గొన్నారు.