వైభవంగా దుర్గా మల్లేశ్వరుల నాల్గవ రోజు దివ్య నగరోత్సవం
ఇంద్రకీలాద్రి మేజర్ న్యూస్ : దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో అత్యంత వైభవోపేతంగా జరుగుతున్న దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో నాల్గవ రోజైన బుధవారం సాయంత్రం ఆదిదంపతులైన దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల పవిత్ర నగర రథోత్సవం ఆధ్యాత్మిక శోభతో అత్యంత వైభవంగా జరిగింది. ఇంద్రకీలాద్రి శిఖరాన జగన్మాత కనకదుర్గ అమ్మవారు దుష్టశిక్షణ, శిష్టరక్షణకారిణి అయిన మహాచండీ దేవి దివ్యాలంకారంలో భక్తులకు దర్శనమిస్తుండగా, పరమ పవిత్రమైన ప్రదోషకాల సమయంలో కొండపై కొలువుదీరిన మల్లేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో ఉత్సవ మూర్తులకు అర్చక బృందం శాస్త్రోక్తంగా విశేష పూజలు, హారతులు నిర్వహించారు. అనంతరం దేవస్థాన కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్ సంప్రదాయబద్ధంగా కొబ్బరికాయ కొట్టి నగరోత్సవ రథయాత్రను ప్రారంభించి, స్వయంగా రథోత్సవంలో పాల్గొన్నారు. నగరోత్సవ రథం ముందుకు సాగుతుండగా నాదస్వరాలు, సన్నాయి మేళాలు, కేరళ పంచవాయిద్యాల దరువులు, శాక్సోఫోన్ మంగళనాదాలు భక్తులను పరవశింపజేశాయి. మహిళా భక్తుల లయాన్విత కోలాటాలు, జానపద కళారూపమైన గరగ నృత్య ప్రదర్శనలు ఊరేగింపులో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. విద్యుద్దీపాలు, సుగంధ పుష్పమాలికలతో సర్వాంగసుందరంగా అలంకరించిన రథంపై అధిష్టించిన జగన్మాతను, పరమేశ్వరుడిని దర్శించుకునేందుకు మార్గమధ్యంలో వేలాది మంది భక్తులు బారులు తీరారు. భక్తులు కొబ్బరికాయలు సమర్పిస్తూ, ధూపదీప కర్పూర నీరాజనాలతో స్వామి, అమ్మవార్లను కీర్తిస్తూ భక్తిప్రపత్తులు చాటుకున్నారు. పురవీధులలో శోభాయమానంగా సాగిన దివ్య రథయాత్ర ఘనంగా తిరిగి ఇంద్రకీలాద్రి పైకి చేరుకుంది. ఆలయ రాజగోపురం ముంగిట ఉత్సవ రథాన్ని నిలిపి, వేద పండితుల వేద మంత్రోచ్ఛారణల నడుమ దుర్గా మల్లేశ్వరులకు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు, దివ్య మంగళ హారతులు సమర్పించారు. నవరాత్రుల వేళ ఆదిదంపతులు కొలువుదీరిన రథాన్ని దర్శించుకోవడం వల్ల సకల దోషాలు తొలగి, కుటుంబంలో శాంతిసౌఖ్యాలు, కార్యసిద్ధి చేకూరుతాయని భక్తుల విశ్వాసం. ఈ దివ్య మహోత్సవంలో ఆలయ స్థానాచార్యులు, ప్రధాన అర్చకులు,ఆలయ ఉద్యోగులు, అశేష భక్తజనం పాల్గొని అమ్మవారి కృపాకటాక్షాలను పొందారు.