సోను లేడీస్ ఎంపోరియంలో అనుమతులు లేకుండా ‘Goree Whitening Soap’ విక్రయం
అనుమతులు లేని ఉత్పత్తుల విక్రయంపై చర్యలు తప్పవు
ఎస్‌ఐ మీనాక్షి
వికారాబాద్, మేజర్ న్యూస్ (అక్టోబర్ 4): అనుమతులు లేకుండా **‘Goree Whitening Soap’**ను విక్రయిస్తున్నారన్న సమాచారంతో వికారాబాద్ పట్టణంలోని సోను లేడీస్ ఎంపోరియంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. వికారాబాద్ టౌన్ సీఐ రఘుకుమార్ ఆదేశాల మేరకు ఎస్‌ఐ మీనాక్షి, కానిస్టేబుల్ కవిత, క్రైమ్ కానిస్టేబుల్ భరత్ తదితర సిబ్బందితో కలిసి దుకాణంలో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా Goree Whitening Soapకు సంబంధించిన అనుమతులు, విక్రయ వివరాలను పరిశీలించగా, సదరు ఉత్పత్తిని విక్రయించేందుకు అవసరమైన అనుమతులు లేనట్లు గుర్తించినట్లు ఎస్‌ఐ మీనాక్షి తెలిపారు. ఈ ఉత్పత్తి వినియోగానికి సంబంధించి మహారాష్ట్రలో గతంలో పలు కేసులు నమోదైనట్లు తమ దృష్టికి వచ్చిందని, సబ్బు వినియోగంతో కిడ్నీ సంబంధిత సమస్యలు తలెత్తుతున్నట్లు సమాచారం ఉందని పేర్కొన్నారు. ప్రజలు ఇలాంటి ఉత్పత్తులను కొనుగోలు చేసే ముందు వాటికి సంబంధించిన అనుమతులు, నాణ్యత, భద్రతా వివరాలను పరిశీలించాలని సూచించారు. అనుమతులు లేకుండా ఇలాంటి ఉత్పత్తులను విక్రయించే వారిపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ మీనాక్షి హెచ్చరించారు.