మెదక్ జిల్లాలో అమూల్-సబర్ డెయిరీ పరిశ్రమకు శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
మెదక్, సూర్య ప్రతినిధి :మెదక్ జిల్లా బ్రహ్మణపల్లి గ్రామంలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న అమూల్-సబర్ డెయిరీ (Amul-Sabar Dairy) పరిశ్రమ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేసి, ప్రత్యేక భూమి పూజ నిర్వహించారు. అనంతరం స్థానిక పాడి రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని వారితో ముచ్చటించారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ... అమూల్ డెయిరీ పరిశ్రమ ఏర్పాటుతో ఈ ప్రాంతంలోని పాడి రైతులకు ఒక గొప్ప భరోసా దొరికిందని ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో అనేక డెయిరీ సంఘాలు విడిపోతుండటం పట్ల ఆందోళన వ్యక్తం చేసిన ఆయన, పాడి రంగంలో స్థిరత్వం కోసం సహకార వ్యవస్థను (Cooperative System) మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని పిలుపునిచ్చారు.