తదుపరి తరం జీఎస్టీ: వికసిత్ భారత్ దిశగా మరో మైలురాయి శ్రీమతి నిర్మల సీతారామన్
వికసిత్ భారత్‌ను సాకారం చేసుకోవాలనే మన దేశ ఆకాంక్ష నెరవేరాలంటే.. వ్యాపార సంస్థలు ఎక్కడ ప్రారంభమైనా, ఏ పరిమాణంలో ఉన్నా స్వేచ్ఛగా ఎదిగేందుకు అనుకూలమైన ఆర్థిక వాతావరణం అత్యవసరం. గడిచిన పన్నెండేళ్లలో మా ప్రభుత్వం అటువంటి బలమైన పునాదులను నిర్మించేందుకే నిరంతరం కృషి చేసింది. 2017లో 'ఒకే దేశం - ఒకే పన్ను' లక్ష్యంతో ప్రవేశపెట్టిన జీఎస్టీ.. పరోక్ష పన్నుల విధానంలో ఒక చారిత్రాత్మక మార్పునకు శ్రీకారం చుట్టింది. ఆ తొమ్మిదేళ్ల అమల్లో ఎదురైన అనుభవాలు, పన్ను చెల్లింపుదారులు మరియు రాష్ట్రాల సూచనలను ప్రామాణికంగా తీసుకుని, ఇప్పుడు 'నెక్స్ట్-జెన్ జీఎస్టీ' రూపంలో ఆర్థిక వ్యవస్థను తదుపరి స్థాయికి తీసుకెళ్తున్నాం.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టికి అనుగుణంగా రూపుదిద్దుకున్న ఈ నెక్స్ట్-జెన్ జీఎస్టీకి ప్రధానంగా రెండు స్పష్టమైన లక్ష్యాలు ఉన్నాయి: మొదటిది పన్ను రేట్లను తగ్గించి, వాటిని సరళీకరించడం; రెండవది పన్ను నిబంధనల పాటింపును అత్యంత సులభతరం చేయడం. ఇందులో భాగంగా సవరించిన నూతన పన్ను రేట్లు 2025 సెప్టెంబర్ 22 నుండి ఇప్పటికే అమలులోకి వచ్చాయి. ఇందుకు సంబంధించిన తదుపరి దశ ప్రక్రియ సంస్కరణలు త్వరలోనే జీఎస్టీ కౌన్సిల్ ముందుకు రానున్నాయి. ఈ సంస్కరణలన్నింటి లక్ష్యం ఒక్కటే.. సామాన్య కుటుంబాల బడ్జెట్‌కు ఉపశమనం అందించడం, వ్యాపార వర్గాలకు స్పష్టత, నమ్మకాన్ని ఇవ్వడం మరియు పన్ను చెల్లింపుదారులు ఎలాంటి అనవసర ఇబ్బందులు లేకుండా తమ బాధ్యతలను సజావుగా నెరవేర్చుకునే అనుకూల వాతావరణాన్ని సృష్టించడం.
ఈ సుదీర్ఘ పయనంలో రాష్ట్రాల పాత్ర అత్యంత కీలకమైనది. కౌన్సిల్ సమావేశాల్లో రాష్ట్రాలు తమ ప్రాధాన్యతలను, క్షేత్రస్థాయి అనుభవాలను పంచుకుంటూ కీలక నిర్ణయాల రూపకల్పనలో భాగస్వాములయ్యాయి. జాతీయ లక్ష్య సాధన కోసం తమ బాధ్యతలను నెరవేరుస్తూనే, భాగస్వామ్య స్ఫూర్తిని చాటుకున్న రాష్ట్ర ప్రభుత్వాల నిబద్ధత అభినందనీయం. జీఎస్టీ సాధించిన ఈ పురోగతి అంతా కూడా 'సహకార సమాఖ్య' స్ఫూర్తికి స్పష్టమైన నిదర్శనం. మనం చేపట్టిన సంస్కరణలు ఎంతటి సానుకూల ఫలితాలను ఇస్తున్నాయో గణాంకాలే చెబుతున్నాయి. 2025 అక్టోబర్ నుండి 2026 జూలై మధ్య కాలంలో, పన్ను పరిధిలోకి వచ్చిన వ్యాపార సరుకులు మరియు సేవల విలువ గత ఏడాదితో పోలిస్తే ఏకంగా 25.8 శాతం పెరిగింది. పన్ను రేట్లను తగ్గించినప్పటికీ ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకోవడం హర్షణీయం. ఇది వ్యాపార రంగానికి మాత్రమే కాకుండా ప్రభుత్వ విత్త విధానానికి కూడా ఎంతగానో తోడ్పడుతోంది.
ఈ ఆర్థిక స్థిరత్వం రాబడి గణాంకాలలో కూడా స్పష్టంగా ప్రతిబింబిస్తోంది. 2026 ఏప్రిల్–సెప్టెంబర్ కాలంలో స్థూల జీఎస్టీ వసూళ్లు రూ.12.46 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఇది గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 11.6 శాతం వృద్ధి. ముఖ్యంగా జూన్ నుండి సెప్టెంబర్ వరకు వరుసగా నాలుగు నెలల పాటు రెండంకెల వార్షిక వృద్ధి నమోదు కాగా, ఈ నాలుగు నెలల వసూళ్లు సమష్టిగా దాదాపు 15 శాతం మేర వేగవంతమయ్యాయి. రీఫండ్‌లు పోను నికర వసూళ్లు కూడా అర్ధ సంవత్సర కాలంలో 10.4 శాతం పెరిగాయి. ఒకవైపు పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం లభిస్తుండగానే, మరొకవైపు అభివృద్ధి కార్యక్రమాలకు అవసరమైన నిధుల రాబడి పెరగడం ఇక్కడి విశేషం.
ఈ వృద్ధి కేవలం ఒకట్రెండు రంగాలకే పరిమితం కాలేదు. దేశంలోని మొత్తం 11 వ్యాపార రంగాలు మరియు అన్ని ప్రధాన రాష్ట్రాలలో పన్ను విధించదగిన విక్రయాలు పెరిగాయి. భారతదేశం వంటి విభిన్నమైన ఆర్థిక వ్యవస్థలో ఈ తరహా విస్తృత వృద్ధి ఎంతో ప్రాధాన్యమైనది. అన్ని ప్రాంతాలు, రంగాలు సమాంతరంగా ఎదుగుతుండటం వల్ల నూతన వ్యాపారాలకు మార్కెట్ విస్తరిస్తుంది. దీని ద్వారా పెట్టుబడులు పెరిగి, డిమాండ్ పుంజుకుని, స్థానికంగా ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి.
సంస్కరణల అనంతరం నేరుగా వినియోగదారులకు జరిగిన అమ్మకాలు కూడా 26.7 శాతం మేర పుంజుకున్నాయి. పన్ను తగ్గింపు ప్రయోజనాలు ధరల తగ్గింపు రూపంలో ప్రజలకు అందినప్పుడు, ప్రతి కుటుంబానికి ఇతర అవసరాలు తీర్చుకోవడానికి లేదా పొదుపు చేయడానికి వెసులుబాటు లభిస్తుంది. వినియోగదారుల ఆర్థిక బలానికి, వ్యాపార వృద్ధికి విడదీయరాని బంధం ఉంది. కుటుంబాల కొనుగోలు శక్తి పెరిగితే మార్కెట్లో వస్తు సేవల డిమాండ్ పెరుగుతుంది. ఆ ప్రయోజనం క్రమంగా చిల్లర వ్యాపారి నుండి సరఫరాదారునికి, చివరికి ఉత్పత్తిదారునికి కూడా చేరుతుంది.
చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలకు జాతీయ మార్కెట్ ద్వారాలు తెరుచుకోవడం ఎంతో లాభదాయకం. టైర్-2, టైర్-3 నగరాల్లోని చిన్న వ్యాపారాలు తమ పరిధిని దాటి ఇతర ప్రాంతాల వినియోగదారులను చేరుకోగలిగినప్పుడే అసలైన ప్రగతి సాధ్యమవుతుంది. జీఎస్టీ తెచ్చిన ఉమ్మడి జాతీయ వ్యవస్థ ఈ అనుసంధానానికి ఎంతగానో సహకరిస్తోంది. సులభమైన పరిపాలనా విధానాలు ఈ బంధాలను మరింత బలోపేతం చేయాలి.
ఈ నూతన విధానంలో వ్యాపారుల భాగస్వామ్యం కూడా విశేషంగా పెరుగుతోంది. ఈ ఏడాది ఆగస్టు నాటికి కేంద్ర, రాష్ట్ర పరిధిలోని జీఎస్టీ రిజిస్ట్రేషన్ల సంఖ్య దాదాపు 1.71 కోట్లకు చేరింది. ఇది గతేడాదితో పోలిస్తే 15 శాతం పెరుగుదల. అలాగే 2026 ఏప్రిల్–జూలై కాల వ్యవధిలో గడువు తేదీలలోగా దాఖలైన జీఎస్టీఆర్-3బీ రిటర్న్లు 12.6 శాతం పెరిగాయి. భాగస్వామ్యం పెరుగుతున్న కొద్దీ పన్ను పరిపాలనా విభాగంపై బాధ్యత కూడా పెరుగుతుంది. స్పష్టమైన మార్గదర్శకాలు, నమ్మకమైన సేవలు మరియు సమస్యల తక్షణ పరిష్కారంతో వ్యాపారులకు ఎల్లప్పుడూ అండగా నిలవాల్సిన అవసరం ఉంది.
మరోవైపు, ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ ప్రక్రియ కూడా గణనీయంగా మెరుగైంది. చెల్లించాల్సిన పన్ను బాధ్యతలో క్రెడిట్‌ల వాటా పెరగడమే కాకుండా, పేరుకుపోయిన క్రెడిట్ పరిమాణం తగ్గింది. చిన్న పరిశ్రమలకు వర్కింగ్ క్యాపిటల్ (కార్యాచరణ మూలధనం) అనేది రక్త ప్రసరణ లాంటిది. క్రెడిట్లు సకాలంలో లభించడం వల్ల చిన్న వ్యాపారులు సులభంగా ఇన్పుట్ లు కొనుగోలు చేసి, ఆర్డర్లు పూర్తి చేయడానికి మార్గం సుగమమైంది. అలాగే, ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య కాలంలోనే దాదాపు రూ.1.80 లక్షల కోట్ల మేర రీఫండ్‌లను నేరుగా వ్యాపార సంస్థలకు వాపసు చేశాం. రావాల్సిన సొమ్ము సకాలంలో చేతికి అందితే వ్యాపారులు భవిష్యత్ ప్రణాళికలను నమ్మకంగా వేసుకోగలరు. రీఫండ్ ప్రక్రియలో వేగం అనేది సమర్థవంతమైన పన్ను విధానానికి నిదర్శనం.
జీఎస్టీ విజయవంతం కావడంతో రాష్ట్రాల రాబడులు కూడా మెరుగయ్యాయి. ఐజీఎస్టీ సెటిల్‌మెంట్లతో కలిపి రాష్ట్రాల మొత్తం ఎస్ జీఎస్టీ ఆదాయం ఈ ఏప్రిల్–సెప్టెంబర్ కాలంలో దాదాపు 16 శాతం పెరిగింది. ఈ నిధులు మౌలిక సదుపాయాల కల్పనకు, ప్రజా సంక్షేమానికి దోహదపడతాయి. ఒకవైపు ప్రజలకు పన్ను భారం తగ్గడం, మరోవైపు వ్యాపారాలు విస్తరించడం, దాని ద్వారా ప్రభుత్వ ఆదాయం పెరిగి దేశాభివృద్ధికి తోడ్పడడం అనే చక్రం నిరంతరం కొనసాగుతోంది.
అయితే, ఎదుగుతున్న వ్యవస్థ చిన్న వ్యాపారులపై మోపే వ్యయం మరియు సమయం పట్ల ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. అక్టోబర్ 7న జరిగే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో రాబోయే ప్రతిపాదనలు ఈ దిశగానే పనిచేస్తాయి. రిజిస్ట్రేషన్, రిటర్న్లు, రీఫండ్‌లు, వివాదాల పరిష్కారం మరియు ఐటీసీ ప్రవాహాన్ని మరింత సులభతరం చేసి, వ్యాపార వ్యయాన్ని తగ్గించడమే మా ప్రాధాన్యత.
జీఎస్టీ అందించిన ఈ బలం, అనుభవంతో ప్రత్యక్ష పన్నులలో కూడా సంస్కరణలను ముమ్మరం చేస్తున్నాం. పన్ను చెల్లింపుదారుల పట్ల గౌరవం, పన్ను విధానంలో పారదర్శకత మరియు స్థిరత్వమే మమ్మల్ని నడిపించే సూత్రాలు. పన్ను వ్యవస్థపై విశ్వాసం పెరిగినప్పుడు వ్యాపారాలు దీర్ఘకాలిక పెట్టుబడులతో ముందుకు వస్తాయి. వ్యాపార రంగానికి ఆ నమ్మకాన్ని అందిస్తూ, ప్రధాని నరేంద్ర మోదీ గారి ఆలోచనలకనుగుణంగా సమర్థవంతమైన, సమ్మోహనకరమైన 'వికసిత్ భారత్' వైపు అడుగులు వేద్దాం
(రచయిత కేంద్ర ఆర్థిక మరియు కార్పొరేట్ వ్యవహారాల మంత్రి)