కుటుంబ కలహాల నేపథ్యంలో యువతి ఆత్మహత్య
పుల్లలచెరువు మేజర్ న్యూస్:
కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ యువతి సమ్మర్ స్టోరేజ్‌లో దూకి ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన పుల్లలచెరువు మండలం ముటుకుల గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. పల్నాడు జిల్లా దుర్గికి చెందిన బుడగజంగాల కుటుంబానికి చెందిన పార్వతి (22) భర్త శంభు, ఇద్దరు పిల్లలతో కలిసి వ్యాపార నిమిత్తం ముటుకుల గ్రామానికి వచ్చారు. గ్రామంలో గుడారాలు ఏర్పాటు చేసుకుని కొంతకాలంగా అక్కడే నివసిస్తున్నారు.ఈ క్రమంలో కుటుంబంలో చోటుచేసుకున్న కలహాలతో పార్వతి మనస్తాపానికి గురైనట్లు సమాచారం. శనివారం సమ్మర్ స్టోరేజ్‌లో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది. విషయం తెలుసుకున్న స్థానికులు, కుటుంబ సభ్యులు ఘటనాస్థలికి చేరుకున్నారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్లు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికానున్నాయి.