ఆల్ పార్టీ కేటుగాడు ఆదినారాయణ రెడ్డి వైసిపి నాయకులు విమర్శలు
ఆల్ పార్టీ కేటుగాడు ఆదినారాయణ రెడ్డి
వైసీపీ నాయకుల విమర్శలు
పులివెందుల మేజర్ న్యూస్:
జమ్మలమడుగు నియోజకవర్గంలో ఆదినారాయణ రెడ్డి రాజకీయంగా అవకాశవాద వైఖరిని అవలంబిస్తున్నారని వైసీపీ నాయకులు విమర్శించారు. యర్రగుంట్లలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి చేసిన విమర్శలు వాస్తవాలకు దగ్గరగా ఉన్నాయని వారు పేర్కొన్నారు.
అధికారంలో ఉన్న సమయంలో కాంట్రాక్టర్లు, కంపెనీలను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయని, ఫ్లైయాష్ నుంచి సోలార్ కంపెనీల వరకు వివిధ వర్గాలపై ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. అధికారం ఉంటే వసూళ్లు, లేకుంటే రాజకీయంగా కనిపించకుండా పోవడం ఆదినారాయణ రెడ్డి శైలిగా మారిందని విమర్శించారు.
వైఎస్ కుటుంబాన్ని విమర్శించే నైతిక అర్హత ఆదినారాయణ రెడ్డికి లేదని అన్నారు. గతంలో వైఎస్ కుటుంబం అందించిన రాజకీయ సహకారాన్ని ఆయన మరిచిపోవద్దని సూచించారు. జగన్‌పై తప్పుడు కేసులు పెట్టిన విషయం ప్రజలకు తెలుసని, రాజకీయంగా ఎదుర్కోలేక వివేకా హత్య కేసును పదేపదే రాజకీయ అంశంగా తెరపైకి తీసుకువస్తున్నారని ఆరోపించారు.
అధికారంలో లేనప్పుడు ప్రజలకు దూరంగా ఉండి, అధికారం వచ్చినప్పుడు అధికార యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయడం సరికాదని అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల కోసం పనిచేస్తుందని పేర్కొన్నారు.
పోలీసులు, అధికారాన్ని అడ్డుపెట్టుకుని కాకుండా బహిరంగ వేదికపై చర్చకు రావాలని, ఎలాంటి అంశంపైనైనా చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని వైసీపీ నాయకులు సవాల్ చేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ చిన్నప్ప, రాష్ట్ర నూర్‌బాషా చైర్మన్ రసూల్, పట్టణ ఉపాధ్యక్షుడు పార్నపల్లి కిషోర్, వైస్ చైర్మన్ హఫీజ్, మాజీ కౌన్సిలర్ కోడి రమణ ఆప్షన్ నెంబర్ చంద్రమౌళి, వైఎస్ఆర్సిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చంద్రమౌళి కనక రాష్ట్ర బూత్ కమిటీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు