ఘనంగా 'నల్లమల సానువుల్లో గాంధీ గారి ప్రస్థానం' పుస్తకావిష్కరణ
ఘనంగా 'నల్లమల సానువుల్లో గాంధీ గారి ప్రస్థానం' పుస్తకావిష్కరణ
--గ్రంథాన్ని ఆవిష్కరించిన డాక్టర్ కాదర్‌బాద్ రవీంద్రనాథ్
---మరుగునపడిన చరిత్రను వెలికితీసిన డాక్టర్ కిశోర్ కుమార్,
నంద్యాల టౌన్ మేజర్ న్యూస్ : నంద్యాల ప్రాంతంలో మహాత్మా గాంధీ పర్యటన, స్వాతంత్ర్యోద్యమ చరిత్రను కళ్లకు కట్టే "నల్లమల సానువుల్లో గాంధీ గారి ప్రస్థానం - స్వరాజ్య సమరంలో నంద్యాల" పుస్తకావిష్కరణ ఆదివారం ఘనంగా జరిగింది. కుందూ సాహితీ సమితి ఆధ్వర్యంలో స్థానిక శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలో జరిగిన ఈ కార్యక్రమంలో డాక్టర్ కురుమేటి కిశోర్ కుమార్ రచించిన ఈ గ్రంథాన్ని డాక్టర్ కాదర్‌బాద్ రవీంద్రనాథ్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ.. నంద్యాల ప్రాంత సామాజిక, రాజకీయ పరిణామాలను ఈ పుస్తకం అద్భుతంగా ఆవిష్కరించిందన్నారు. చాగలమర్రి నుంచి ఆదోని వరకు సాగిన గాంధీజీ పర్యటన, ఆయనకు కాదర్‌బాద్ నరసింగరావు ఆతిథ్యం ఇవ్వడం వంటి ఆసక్తికర విషయాలతో పాటు 66 మంది సమరయోధుల జీవిత విశేషాలను రచయిత అక్షరబద్ధం చేశారని ప్రశంసించారు. భావితరాలకు ఇలాంటి చారిత్రక అంశాలను అందించడంలో డాక్టర్ కిశోర్ కుమార్ కృషి అభినందనీయమని సభాధ్యక్షులు డాక్టర్ గెలివి సహదేవుడు, డాక్టర్ హయగ్రీవాచార్యులు తదితరులు కొనియాడారు.
చిన్ననాటి నుంచి నంద్యాల చరిత్రపై తనకున్న ఆసక్తే ఈ గ్రంథ రూపకల్పనకు కారణమని రచయిత డాక్టర్ కిశోర్ కుమార్ తెలిపారు. అనంతరం ఆయన్ను సాహితీ ప్రియులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఉదయ్ శంకర్, డాక్టర్ హరికిషన్, డాక్టర్ రామకృష్ణారెడ్డి, చంద్రశేఖర కల్కూర, జె.ఎస్.ఆర్.కె. శర్మ, పలు సాహితీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.