దివ్యాంగుల ఆత్మగౌరవానికి అండగా ఉంటాం
- కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
శ్రీకాకుళం: దివ్యాంగులు ఇతరులపై ఆధారపడకుండా స్వశక్తితో ఎదిగి ఆత్మగౌరవంతో జీవించేలా అవసరమైన ప్రతి సాయాన్ని అందిస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. శ్రీకాకుళం పట్టణంలోని సన్‌రైజ్ కన్వెన్షన్ హాల్‌లో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కార్పొరేట్ సామాజిక బాధ్యత (సి.ఎస్.ఆర్) నిధులు రూ.1.50 కోట్లతో, ఆలింకో భాగస్వామ్యంతో 230 మంది దివ్యాంగులు, వయోవృద్ధులకు 130 బ్యాటరీ ట్రైసైకిళ్లు, 100 జాయ్‌స్టిక్ వీల్‌చేర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో దివ్యాంగులందరికీ అవసరమైన పరికరాలు పూర్తిగా అందే వరకు ప్రతి ఏటా ఈ పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. దివ్యాంగులకు సేవ చేయడం అత్యంత సంతృప్తినిస్తుందని, వారిలో ఉండే ఆత్మవిశ్వాసం, మనోధైర్యం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు. దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్‌లో ప్రతి మూడో శుక్రవారం 'స్వాభిమాన్' పేరిట ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహిస్తున్నామని కేంద్ర మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు సుమారు 150 మంది దివ్యాంగులకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించామని వివరించారు. ఈ మంచి కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి సైతం అభినందించి, రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ అమలు చేయాలని సూచించారని తెలిపారు. తమ తండ్రి అమరజీవి కింజరాపు ఎర్రన్నాయుడు బాటలోనే పేదలు, కార్మికులు, దివ్యాంగుల సంక్షేమానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని పేర్కొన్నారు. జిల్లా అభివృద్ధిలో భాగంగా పలాస విమానాశ్రయం, భోగాపురం విమానాశ్రయ నిర్మాణాల వేగవంతం, అరసవల్లి, శ్రీకూర్మం దేవాలయాల పునరుద్ధరణకు ప్రత్యేక నిధులు తీసుకువచ్చామని, నిరుద్యోగ యువత కోసం ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ కేంద్ర మంత్రి చొరవతో భారత ప్రభుత్వ నిబంధనలకు మించి జిల్లాలోని దివ్యాంగులకు మెరుగైన సాయం అందించగలుగుతున్నామన్నారు. గత నాలుగేళ్లలో (2021 నుండి 2026 వరకు) నాలుగు విడతల్లో మొత్తం రూ.7.98 కోట్ల ఖర్చుతో 2,313 మంది దివ్యాంగులకు 4,491 సహాయ పరికరాలను అందజేసినట్లు వెల్లడించారు. కలెక్టరేట్ నుండి ప్రారంభించి అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో దివ్యాంగులు సులభంగా రాకపోకలు సాగించేందుకు ర్యాంప్‌లు, లిఫ్ట్‌లు ఏర్పాటు చేశామని తెలిపారు. కేవలం పరికరాలు ఇవ్వడమే కాకుండా, వీటి ద్వారా వారి జీవితాల్లో వస్తున్న మార్పులపై అధ్యయనం చేసి, చిన్న తరహా వ్యాపారాలు, స్వయం ఉపాధి కల్పించే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని స్పష్టం చేశారు. శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ మాట్లాడుతూ దివ్యాంగులు, పేదల పట్ల కీర్తిశేషులు ఎర్రన్నాయుడు చూపిన ఆప్యాయతను ఆయన తనయుడు రామ్మోహన్ నాయుడు కొనసాగిస్తుండటం అభినందనీయమన్నారు. కేంద్ర మంత్రి, కలెక్టర్ సమన్వయంతో జిల్లాలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే దివ్యాంగుల పింఛన్‌ను రూ.3,000 నుండి రూ.6,000 కు పెంచి ఆర్థికంగా ఆదుకుందని, ఉద్యోగాల్లోనూ ప్రత్యేక కోటా కల్పించిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్‌డిఒ ప్రత్యూష, ఆలింకో ప్రతినిధులు, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా జాయింట్ జనరల్ మేనేజర్, ఆర్డీవో సాయి ప్రత్యూష, వివిధ శాఖల అధికారులు, దివ్యాంగులు పాల్గొన్నారు.