యుద్ధ విమానాల కొరతపై వైమానిక దళ చీఫ్ ఆందోళన
‘విమానాల డెలివరీ ఆలస్యం తీవ్ర ప్రభావం చూపుతోంది’. ఏటా 36-40 ఫైటర్ జెట్లు అవసరమని స్పష్టీకరణ
సూర్య జాతీయ డెస్క్: భారత వైమానిక దళంలో క్రమంగా తగ్గుతున్న యుద్ధ విమానాల స్క్వాడ్రన్ల సంఖ్యపై వైమానిక దళాధిపతి (ఎయిర్ చీఫ్ మార్షల్) తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కొత్త యుద్ధ విమానాల సేకరణ, డెలివరీల్లో జరుగుతున్న జాప్యం దేశ రక్షణ సన్నద్ధతపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతోందని ఆయన కుండబద్దలు కొట్టారు. ప్రస్తుతం ఉన్న స్క్వాడ్రన్ల బలాన్ని నిలకడగా ఉంచుకోవాలన్నా, భవిష్యత్ భద్రతా సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవాలన్నా వైమానిక దళానికి ఏటా కనీసం 36 నుంచి 40 అధునాతన యుద్ధ విమానాలు అవసరమని స్పష్టం చేశారు.
హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) నుంచి తేజస్ మార్క్-1ఏ విమానాల సరఫరాలో ఏర్పడిన జాప్యం, అలాగే మల్టీ-రోల్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ (ఎంఆర్ఎఫ్ఏ) ప్రాజెక్టుల పురోగతిపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. స్వదేశీ రక్షణ ఉత్పత్తులను తాము పూర్తిస్థాయిలో ప్రోత్సహిస్తున్నప్పటికీ, నిర్ణీత గడువులోగా విమానాలను సైన్యానికి అందించాల్సిన బాధ్యత తయారీ సంస్థలపై ఉందని గుర్తుచేశారు. కాలం చెల్లిన మిగ్ విమానాల ఉపసంహరణ జరుగుతున్న వేళ, సరిహద్దుల్లోని రెండు వైపుల నుంచి పొంచి ఉన్న ముప్పులను దీటుగా ఎదుర్కొనేందుకు ఫైటర్ జెట్ల సేకరణ ప్రక్రియను యుద్ధప్రాతిపదికన వేగవంతం చేయాలని రక్షణ రంగానికి సూచించారు.