ఆపరేషన్ త్రిశూల్‌లో భాగంగా వత్సవాయిలో విస్తృత వాహన తనిఖీలు
ఆపరేషన్ త్రిశూల్‌లో భాగంగా వత్సవాయిలో విస్తృత వాహన తనిఖీలు
వత్సవాయి మేజర్ న్యూస్ :- ఆపరేషన్ “త్రిశూల్”లో భాగంగా వత్సవాయి పోలీసుల ఆధ్వర్యంలో వత్సవాయి సెంటర్‌లో విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించారు. వత్సవాయి ఎస్‌ఐ ఉమా మహేశ్వరరావు ఆధ్వర్యంలో చేపట్టిన ఈ తనిఖీల్లో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వాహనదారులపై ప్రత్యేక దృష్టి సారించారు.
ఈ సందర్భంగా హెల్మెట్ లేకుండా వాహనాలు నడపడం, మద్యం సేవించి వాహనాలు నడపడం, ఒకే ద్విచక్ర వాహనంపై ముగ్గురు ప్రయాణించడం, మైనర్లు వాహనాలు నడపడం వంటి నిబంధనల ఉల్లంఘనలను పోలీసులు పరిశీలించారు. వాహనాలను నిలిపి పత్రాలను తనిఖీ చేసి, నిబంధనలు పాటించని వాహనదారులపై తగిన చర్యలు చేపట్టారు.
ముఖ్యంగా మైనర్లు వాహనాలు నడపకుండా తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించాలని ఎస్‌ఐ ఉమా మహేశ్వరరావు సూచించారు. మద్యం సేవించి వాహనం నడపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున ఎట్టి పరిస్థితుల్లోనూ డ్రంక్ డ్రైవ్‌కు పాల్పడవద్దని వాహనదారులకు సూచించారు.
రోడ్డు ప్రమాదాల నివారణ, ప్రజల భద్రతే లక్ష్యంగా వాహన తనిఖీలు నిర్వహిస్తున్నామని పోలీసులు తెలిపారు. ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఎస్‌ఐ ఉమా మహేశ్వరరావు సూచించారు.