ఘనవిజయమే లక్ష్యంగా ఆత్మకూరు మున్సిపల్ ఎన్నికలపై ఎన్ డి ఏ కూటమి కీలక భేటీ
ఘన విజయమే లక్ష్యంగా ఆత్మకూరు మున్సిపల్ ఎన్నికలపై ఎన్డీఏ కూటమి కీలక భేటీ
--ఎన్నికల వ్యూహంపై పరిశీలకులతో మంత్రి ఆనం సమాలోచనలు
--వార్డుల వారీగా పరిస్థితులు, అభ్యర్థుల ఎంపికపై విస్తృత చర్చ
-- టీడీపీ,జనసేన,బీజేపీ శ్రేణుల సమన్వయంతో ముందుకు
--పొత్తు ధర్మమే ప్రాతిపదికగా ఎన్నికల కార్యాచరణకు కీలక నిర్ణయాలు
ఆత్మకూరు,మేజర్ న్యూస్ :
ఆత్మకూరు మున్సిపల్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయమే లక్ష్యంగా అనుసరించాల్సిన వ్యూహంపై ఆదివారం రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నివాసంలో కూటమి పరిశీలకులతో కీలక సమావేశం జరిగింది.
మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని, క్షేత్రస్థాయిలో పటిష్టమైన కార్యాచరణతో ముందుకు వెళ్లే అంశంపై మంత్రి ఆనం పరిశీలకులతో విస్తృతంగా సమాలోచనలు జరిపారు.
ప్రధానంగా వార్డుల వారీగా రాజకీయ పరిస్థితులు, అభ్యర్థుల ఎంపిక, గెలుపు అవకాశాలు, నాయకులు,కార్యకర్తల మధ్య సమన్వయం, ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాల్సిన కూటమి ప్రభుత్వ అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం.
టీడీపీ,జనసేన,బీజేపీ నాయకులు, కార్యకర్తలు పూర్తి సమన్వయంతో పనిచేస్తూ ప్రతి వార్డులోనూ కూటమిని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది.
స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఎన్నికల వ్యూహాన్ని రూపొందిస్తూ, అన్ని స్థాయిల నాయకత్వాన్ని కలుపుకొని ముందుకు సాగాలని అభిప్రాయపడినట్లు సమాచారం.
రాష్ట్ర స్థాయిలో కూటమి అగ్రనేతల దిశానిర్దేశానికి అనుగుణంగా పొత్తు ధర్మాన్ని పాటిస్తూ, మూడు పార్టీల మధ్య సమన్వయంతో ఆత్మకూరు మున్సిపాలిటీపై ఎన్డీఏ విజయపతాకం ఎగురవేయడమే లక్ష్యంగా ఎన్నికల కార్యాచరణకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం.ఈ సమావేశంలో మంత్రి ఆనం తో పాటు నియోజకవర్గ తెలుగుదేశం సీనియర్ నాయకులు తాళ్లూరు గిరినాయుడు, కాటంరెడ్డి రవీంద్రా రెడ్డి, ఆత్మకూరు పట్టణ తెలుగుదేశం అధ్యక్షుడు తుమ్మల చంద్రారెడ్డి, సీనియర్ బిజెపి నాయకుడు కుడుముల సుధాకర్ రెడ్డి, సీనియర్ జిల్లా జనసేన నాయకుడు నలిశెట్టి శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.