డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను పేదలకు అందజేయాలి
నిర్లక్ష్యంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారుతున్నాయి
మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్
ధారూర్, మేజర్ న్యూస్, (అక్టోబర్ 4):
పేదలకు కేటాయించాల్సిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను తక్షణమే అర్హులైన లబ్ధిదారులకు అందజేయాలని వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించకుండా ఖాళీగా ఉంచడం వల్ల అవి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారుతున్నాయని ఆయన ఆరోపించారు.ఆదివారం ధారూర్ మండల కేంద్రంలో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల సముదాయాన్ని మెతుకు ఆనంద్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనే సుమారు 90 శాతం నిర్మాణ పనులు పూర్తయ్యాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం మిగిలిన 10 శాతం పనులను పూర్తి చేసి అర్హులైన పేద కుటుంబాలకు ఇళ్లను కేటాయించాల్సి ఉందన్నారు.అయితే ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఇళ్లు వినియోగంలోకి రాకపోవడంతో తాగుబోతులు, గంజాయి సేవించే వారు అక్కడకు చేరుతున్నారని ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతోనే ఇళ్ల కేటాయింపులో ప్రభుత్వం జాప్యం చేస్తోందనే అనుమానాలు ప్రజల్లో ఉన్నాయని మెతుకు ఆనంద్ పేర్కొన్నారు. పేదల ఇళ్ల సమస్య ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు.ఇకనైనా ప్రభుత్వం స్పందించి పెండింగ్‌లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేసి, అర్హులైన పేద కుటుంబాలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మాజీ మండల అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి, సీనియర్ నాయకుడు వేణుగోపాల్‌రెడ్డి, ధారూర్ గ్రామ సర్పంచ్ ప్రమీల చిన్నయ్య గౌడ్, యూత్ ప్రెసిడెంట్ జైపాల్‌రెడ్డి, ఆఫీస్ అంజయ్య, పోటరి మహేష్ యాదవ్, శ్రీశైలం తదితర బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రిపోర్టర్ సుధాకర్.