విద్యార్థులకు సైబర్ నేరాలు, బాలికల భద్రతపై అవగాహన
సూర్య, లక్షెట్టిపేట/మంచిర్యాల జిల్లా ప్రతినిధి :
విద్యార్థుల్లో సామాజిక బాధ్యత, భద్రత, భవిష్యత్తుపై అవగాహన కల్పించే ఉద్దేశంతో ఆదివారం స్థానిక పీఎం సాంఘీక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా స్థానిక ఎస్సై గోపతి సురేష్ హాజరై మాట్లాడారు. సైబర్ నేరాల నివారణ, బాలికల భద్రత, ఆత్మహత్యా ప్రవృత్తుల నివారణ, మూఢనమ్మకాల నిర్మూలన మరియు మెరుగైన భవిష్యత్తు నిర్మాణం అనే అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ తగు ఉదాహరణలతో విద్యార్థులకు విలువైన సూచనలు చేశారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, సాంకేతిక పరిజ్ఞానాన్ని బాధ్యతాయుతంగా వినియోగించాలని, బాలికలు వ్యక్తిగత రక్షణ, మానసిక ధైర్యంతో ఉండాలని సూచించారు. మూఢనమ్మకాలకు దూరంగా ఉండాలని, ఎటువంటి సమస్య ఎదురైనా భయపడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పోలీసులను సంప్రదించాలని తెలిపారు. సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటూ, సానుకూల దృక్పథంతో విద్యాభ్యాసంపై దృష్టి సారించి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ రమేష్, పాఠశాల ప్రిన్సిపల్ రమాకళ్యాణి, ఉపాధ్యాయులు రజిత, సాధిక, పల్లవి, అంజలి,విద్యార్థులు పాల్గొన్నారు.