సమస్య పరిష్కారం అయ్యేంతవరకు పోరాటం కొనసాగిస్తాం.
గన్నవరం, అక్టోబర్ 4, మేజర్ న్యూస్. ప్రతినిధి (గుర్రం ప్రసాద్).
విమానాశ్రయ విస్తరణ, ఏలూరు కాలువ మళ్లింపు కోసం నివాస స్థలాలు కోల్పోయిన దావాజీగూడెం బాధితుల రిలే నిరాహార దీక్షలు ఆదివారం ఏడో రోజుకు చేరాయి. సమస్య పరిష్కారమయ్యే వరకు ఆందోళన కొనసాగిస్తామని బాధితుల ప్రతినిధి వేదవతి స్పష్టం చేశారు. గత 11 ఏళ్లుగా అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగినా తమకు న్యాయం జరగలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. విమానాశ్రయ అభివృద్ధి కోసం స్థలాలు త్యాగం చేసిన 552 మంది ప్లాట్ యజమానుల్లో 423 మంది దావాజీగూడెం బాధితుల సమస్యను ప్రభుత్వం పరిష్కరించకపోవడం అన్యాయమన్నారు. సొంత ఇల్లు గౌరవప్రదమైన జీవనానికి సంకేతమని చెబుతున్న ప్రభుత్వం, తమ విషయంలో ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. తాము కూడా రాష్ట్ర ప్రజలేనని, అందరికీ సమాన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు కొడాలి సుధాకర్ మాట్లాడుతూ.. తామంతా పేద, దళిత వర్గాలకు చెందినవారమని, 13 ఏళ్లుగా ప్రభుత్వం తమ సమస్యను పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయం చేయకపోతే ఆందోళనను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు మల్లంపల్లి ఆంజనేయులు, మండల కార్యదర్శి కళ్ళం రాంబాబు, కౌలు రైతు సంఘం నాయకులు కైలే యేసుదాసు, కేవీపీఎస్ నాయకులు మిరప నాగేశ్వరరావు, మహిళా సంఘం నాయకురాలు కళ్ళం స్వరూపారాణి, బాధితులు తిరివీధి యేసురత్నం తదితరులు పాల్గొన్నారు.