andhrapradesh
సమాజంలో ఉపాధ్యాయ వృత్తికి ప్రత్యేక గౌరవం
- ఘనంగా ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం..
ఆమదాలవలస: ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆమదాలవలస పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విశేష సేవలు అందిస్తున్న గణిత ఉపాధ్యాయులు షేక్ షావలి తాండ్ర చంద్ర మనోహర్‌లను జన విజ్ఞాన వేదిక జిల్లా కమిటీ ఘనంగా సన్మానించింది. పాఠశాల ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు పైల రవికుమార్ ఆధ్వర్యంలో వారికి శాలువాలు కప్పి అభినందనలు తెలిపింది. ఈ సందర్బంగా జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి గొంటి గిరిధర్ మాట్లాడుతూ 1966 అక్టోబర్ 5న యునెస్కో, అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) ఉపాధ్యాయుల స్థితిగతులకు సంబంధించి చేసిన సిఫార్సుల నేపథ్యంలో 1994 నుంచి అక్టోబర్ 5న ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉత్తమ సేవలు అందిస్తున్న ఉపాధ్యాయులను ఈ సందర్భంగా గౌరవించుకోవడం ఆనవాయితీగా వస్తోందన్నారు. పాఠ్య బోధనకే పరిమితం కాకుండా అదనపు సమయాన్ని కేటాయిస్తూ విద్యార్థుల క్రమశిక్షణ, శ్రేయస్సు, ఆరోగ్య పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేస్తున్న షేక్ షావలి, తాండ్ర చంద్ర మనోహర్‌లను సత్కరించడం అభినందనీయమన్నారు. ఉపాధ్యాయ వృత్తి కేవలం ఉద్యోగం కాదని సమాజాభివృద్ధికి దోహదపడే గొప్ప అవకాశమని పేర్కొన్నారు. శాస్త్రీయ దృక్పథం కలిగిన సమాజ నిర్మాణానికి ఉపాధ్యాయులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. స్టాఫ్ సెక్రటరీ, జీటీఏ జిల్లా అధ్యక్షులు పైడి రామస్వామి నాయుడు, ఎస్. సులోచన రాణి, విద్యార్థులు శరణ్య దీప్తి, యాదవరావు, రాకేష్ తదితరులు సన్మాన గ్రహీతలను ఉద్దేశించి మాట్లాడారు. అలాగే ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉత్తమ సేవలు అందిస్తున్న ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయిని బంగారు శరత్‌కుమారి, సోషల్ స్టడీస్ ఉపాధ్యాయులు బి.ఏ. శివరాజ్, హిందీ ఉపాధ్యాయులు కోట ఈశ్వరరావులను పాఠశాల సిబ్బంది శాలువాలతో సత్కరించి అభినందించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు టి. పద్మావతి, ఎస్. అరుణ, జి. కుమారి, ఎం. ఉమాకుమారి, పి. ధనలక్ష్మి, ఎం.వి.ఆర్. భట్లు, విద్యార్థులు పాల్గొన్నారు.