బిజెపి కార్యాలయంగా ఎస్ వి యు -విద్యార్థులకు ఒక రూల్, బీజేపీకి ఒక రూల్ - ఇదేనా కూటమి ప్రభుత్వ న్యాయం.? ఎన్ ఎస్ యు ఐ
శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ పవిత్రతను కూటమి ప్రభుత్వం బీజేపీకి తాకట్టు పెడుతోందని ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జెన్నే మల్లికార్జున తీవ్రంగా మండిపడ్డారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటనలో మాట్లాడుతూ ఎస్.వి యూనివర్సిటీ పరిధిలోని తారకరామ స్టేడియంలో విద్యార్థి సంఘాలు సమస్యలపై గొంతు విప్పితే అనుమతులు లేవు, సర్క్యులర్లు అడ్డం. కానీ బీజేపీ సభకు మాత్రం రెడ్ కార్పెట్ వేసి అనుమతులిస్తారా? అని ప్రశ్నించారు.గతంలో యూనివర్సిటీ ప్రాంగణంలో రాజకీయ కార్యక్రమాలు నిషేధమంటూ సర్క్యులర్లు జారీ చేసిన అధికారులు, ఇప్పుడు అధికార పార్టీ ఒత్తిడికి తలొగ్గి నిబంధనలను తుంగలో తొక్కారని ఆరోపించారు.
విద్యార్థుల హక్కులను కాలరాస్తూ, యూనివర్సిటీని బీజేపీ రాజకీయ వేదికగా మార్చే కుట్ర జరుగుతోందని, ఇది విద్యా వ్యవస్థ స్వయంప్రతిపత్తిపై దాడి అని అన్నారు.క్యాంపస్ విద్యార్థులది, కాషాయ పార్టీ జాగీరు కాదు"అని హెచ్చరించారు.ఈ అనుమతిని వెంటనే రద్దు చేయకపోతే, యూనివర్సిటీ పరిపాలన భవనం ముందు ఆధ్వర్యంలో భారీ విద్యార్థి నిరసనలు, ముట్టడి కార్యక్రమాలు చేపడతామని, కూటమి ప్రభుత్వ విద్యా వ్యతిరేక విధానాలను బట్టబయలు చేస్తామని జెన్నే మల్లికార్జున హెచ్చరించారు.
సీఎం గౌడ్ తిరుపతి ప్రతినిధి