స్టార్స్‌బక్స్‌కు చుక్కెదురు
సూర్య బిజినెస్ డెస్క్: ప్రముఖ గ్లోబల్ కాఫీ దిగ్గజం స్టార్స్‌బక్స్ కంపెనీ భారీ న్యాయపరమైన చిక్కుల్లో పడింది. తమ ప్రొటీన్ పానీయాల శ్రేణిలో విక్రయిస్తున్న కొన్ని డ్రింక్స్‌ను 'షుగర్-ఫ్రీ' (చక్కెర రహితం) అంటూ తప్పుదారి పట్టించే ప్రకటనలతో విక్రయిస్తున్నారంటూ వినియోగదారులు ఫెడరల్ కోర్టును ఆశ్రయించారు. వాషింగ్టన్ ఫెడరల్ కోర్టులో దాఖలైన ఈ క్లాస్ యాక్షన్ వ్యాజ్యం ప్రకారం, షుగర్-ఫ్రీగా లేబుల్ చేసిన ఎనిమిది రకాల ప్రొటీన్ పానీయాలలో వాస్తవానికి గణనీయమైన స్థాయిలో చక్కెర ఉన్నట్లు ఆరోపణలు వెలువడ్డాయి. ఆరోగ్య స్పృహ కలిగిన వినియోగదారులను ఆకర్షించేందుకు కంపెనీ తప్పుడు ప్రకటనలతో వ్యాపారం చేస్తోందంటూ దాఖలైన ఈ పిటిషన్ కార్పొరేట్ వర్గాల్లో సంచలనం సృష్టించింది.
ఫెడరల్ నిబంధనల ప్రకారం సాధారణంగా చక్కెర లేని పానీయాలుగా ప్రకటించే ఉత్పత్తులలో పరిమిత మోతాదుకు మించి షుగర్ ఉండకూడదు. అయితే స్టార్స్‌బక్స్ విక్రయిస్తున్న వెంట్ సైజ్ ప్రొటీన్ పానీయాలలో దాదాపు 13 నుంచి 21 గ్రాముల వరకు చక్కెర ఉన్నట్లు లాయర్లు పిటిషన్‌లో పేర్కొన్నారు. కస్టమర్లు ఆరోగ్యకరమైన మరియు చక్కెర లేని పానీయాలను కోరుకుంటున్న తరుణంలో, ఈ పానీయాలు ఆ అంచనాలను ఉల్లంఘిస్తున్నాయని వారు వాదిస్తున్నారు. ఈ ప్రకటనలపై స్టార్స్‌బక్స్ యాజమాన్యం నుంచి ఇప్పటివరకు అధికారిక స్పందన రానప్పటికీ, తప్పుడు ప్రకటనలు మరియు వినియోగదారుల రక్షణ చట్టాల ఉల్లంఘన కింద దాఖలైన ఈ కేసు కంపెనీ బ్రాండ్ ప్రతిష్టను దెబ్బతీసే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.