నారాయణపేట మైనార్టీ స్కూల్ ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేయాలి
నారాయణపేట, సూర్యన్యూస్:
విద్యార్థులకు సరైన భోజనం అందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన నారాయణపేట మైనారిటీ స్కూల్ ప్రిన్సిపల్ ను వెంటనే సస్పెండ్ చేయాలని ఎస్ ఎఫ్ ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు భానుప్రసాద్, పవన్ కుమార్ డిమాండ్ చేశారు. సోమవారం నారాయణపేట పట్టణంలోని వల్లంపల్లి రోడ్డులో గల మైనారిటీ స్కూల్ ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి అక్కడి సమస్యలు తెలుసుకున్నారు. అయితే గత వారం రోజులుగా హాస్టల్లో సరైన భోజనం అందడం లేదని, నీళ్ల చారు తప్ప ఎలాంటి కూరగాయలు భోజనంలో అందించడం లేదని వాపోయారు. హాస్టల్లో సరుకులు లేకపోవడంతో ఉపాధ్యాయులు కొందరు సొంతంగా డబ్బులు కలెక్షన్ చేసి కొంత సరుకులు తెప్పించిన పరిస్థితి నెలకొందని చెప్పుకొచ్చారు. అయితే ప్రిన్సిపల్ నాలుగు రోజుల నుంచి పాఠశాలకు రావడం లేదని, సమస్యపై ప్రిన్సిపాల్ ను ఫోన్లో సంప్రదించిన స్పందించలేదని వాపోయారు. విద్యార్థుల సమస్య పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాఠశాల ప్రిన్సిపాల్ ను వెంటనే సస్పెండ్ చేయాలని, విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
-- రాజేష్ కుమార్, సూర్య రిపోర్టర్ నారాయణపేట.