BREAKING
పెట్టుబడుల్లో నష్టాలు వచ్చాయా?: క్యాపిటల్ లాస్‌ను ఎన్ని సంవత్సరాలు క్యారీ ఫార్వర్డ్ చేయవచ్చో తెలుసా.. ఐటీ నిబంధనలివే! శ్రీ దుర్గా మల్లేశ్వర అమ్మవారికి వెండి కిరీటం సమర్పించిన ఎమ్మెల్యే బడేటి చంటి,మీనా దంపతులు మిట్స్‌ యూనివర్సిటీకి అంతర్జాతీయ గుర్తింపు సోషల్ మీడియా పోస్టులపై పోలీసులు హెచ్చరిక. కేంద్ర మంత్రి కృషితో అత్తిలిలో అత్యాధునిక డయాలసిస్ కేంద్రం -- ఎన్‌ఎండీసీ నుంచి రూ.75 లక్షల సీఎస్‌ఆర్ నిధులతో 7 అత్యాధునిక డయాలసిస్ మిషన్లు శ్రీమహమ్మారమ్మ ఆలయంలో ప్రారంభమైన శరన్నవరాత్రి వేడుకలు కొమరగిరిపట్నం శివారు దైవాలపాలెంలో వాటర్ ట్యాంక్ నిర్మాణానికి శంకుస్థాపన: ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు! బీసీలకు ఎక్కువ శాతం సీట్లు కేటాయింపు నిర్ణయం పట్ల జగదీశ్వరి హర్షం సీతారాంపల్లి గ్రామం పాడిపంటలతో సుభిక్షంగా వర్ధిల్లాలి వి.హెచ్.పి సిద్ధాంతాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి పుష్కరాల పనులకు శంకుస్థాపనలు * రూ.4.02కోట్లతో రహదారుల అభివృద్ది :వాసంశెట్టి సత్యం మృతుల కుటుంబాలకు కంచి పరమేశ్వర రెడ్డి ఆర్ధిక సాయం వృద్ధురాలు అదృశ్యం.. ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వండి షాద్ నగర్ లో రోడ్డు ప్రమాదం... వ్యక్తి దుర్మరణం అవయవదానానికి సమ్మతించిన టీడీపీ నేత మాధవరావు

సిద్దిపేట అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించింది మాజీ మంత్రి హరీష్ రావు

Select Suryaa Now
సిద్దిపేట అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించింది మాజీ మంత్రి హరీష్ రావు

 

 

సిద్దిపేట ; సిద్దిపేట జిల్లా ఏర్పడి పదేళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన దశాబ్ది ఉత్సవాల ముగింపు సభలో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. సిద్దిపేట జిల్లాలో గత ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని, పలు ప్రాజెక్టులను రద్దు చేసిందని ఆరోపించారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల మోటార్లను పూర్తిస్థాయిలో నడపకపోవడం వల్లే రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. ఇది ప్రకృతి తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యంతో ఏర్పడిన కృత్రిమ కరువని వ్యాఖ్యానించారు.ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించిన మూడు రోజుల దశాబ్ది ఉత్సవాల ముగింపు మహాసభకు వేలాది మంది ప్రజలు తరలివచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి గోదావరి జలాలతో ప్రజాప్రతినిధులు జలాభిషేకం చేశారు. అనంతరం హరీశ్‌రావు ప్రసంగిస్తూ సిద్దిపేట జిల్లా ఏర్పాటు, సాగునీటి ప్రాజెక్టులు, వైద్య విద్య, రహదారులు, పట్టణాభివృద్ధి తదితర అంశాలను ప్రస్తావించారు.

కేసీఆర్‌తోనే సిద్దిపేట జిల్లా ఏర్పాటు

1983లో ఎన్టీఆర్‌కు సిద్దిపేట జిల్లాను ఏర్పాటు చేయాలని దరఖాస్తు ఇచ్చిన నాయకుడు, ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే లక్ష్యాన్ని నెరవేర్చి 2016 అక్టోబర్ 11న జిల్లాను ఏర్పాటు చేశారని హరీశ్‌రావు పేర్కొన్నారు. జిల్లా ఏర్పాటు వల్ల పరిపాలన ప్రజలకు చేరువైందని, కొత్త మండలాలు, గ్రామ పంచాయతీల ఏర్పాటుతో అభివృద్ధికి మార్గం సుగమమైందన్నారు. జిల్లా ఏర్పడిన తర్వాత విద్యుత్, వ్యవసాయం, వైద్యం, విద్య, మౌలిక వసతుల రంగాల్లో గణనీయమైన మార్పులు వచ్చాయని తెలిపారు.

ఒకప్పుడు రైతులు విద్యుత్ కనెక్షన్లు, ట్రాన్స్‌ఫార్మర్ల కోసం సంగారెడ్డికి వెళ్లాల్సి వచ్చేదని గుర్తుచేశారు. నేడు జిల్లా కేంద్రంలోనే అనేక ప్రభుత్వ సేవలు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. దేశవ్యాప్తంగా అవార్డుల ప్రదానోత్సవాల్లో సిద్దిపేట పేరు నిలిచిందని పేర్కొన్నారు.

సాగునీటి ప్రాజెక్టులతో సస్యశ్యామలం

బెజ్జంకి పరిధిలోని అనంతగిరి, హుస్నాబాద్‌లో గౌరవెల్లి, సిద్దిపేటలో రంగనాయకసాగర్, దుబ్బాకలో మల్లన్నసాగర్, గజ్వేల్‌లో కొండపోచమ్మసాగర్ వంటి ప్రాజెక్టులతో జిల్లాలో సాగునీటి వసతులు మెరుగుపడ్డాయని హరీశ్‌రావు అన్నారు. కేసీఆర్ పాలనలో రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరా అందించామని, సాగునీటి సౌకర్యాలతో వ్యవసాయం బలోపేతమైందని తెలిపారు.

ప్రస్తుత ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి, సాగునీటి సరఫరాపై తగిన శ్రద్ధ చూపడం లేదని ఆరోపించారు. కృష్ణా, గోదావరి నదుల్లో నీరు అందుబాటులో ఉన్నప్పటికీ కాళేశ్వరం, కల్వకుర్తి, దేవాదుల ప్రాజెక్టుల మోటార్లను పూర్తిస్థాయిలో నడపడం లేదని విమర్శించారు. రంగనాయకసాగర్‌ను పూర్తిస్థాయిలో నింపకపోవడంతో యాసంగి పంటలకు ఇబ్బందులు ఏర్పడే ప్రమాదం ఉందన్నారు.

గౌరవెల్లి ప్రాజెక్టు పనులు 98 శాతం పూర్తయ్యాయని, దుబ్బాక, దౌల్తాబాద్ ప్రాంతాల్లోని 30 గ్రామాలకు నీరందించే ఇరుకోడ్ ఎత్తిపోతల పథకం పనులు 90 శాతం పూర్తయ్యాయని పేర్కొన్నారు. మిగిలిన పనులను పూర్తి చేసి ప్రజలకు ప్రయోజనం చేకూర్చాలని డిమాండ్ చేశారు.

సిద్దిపేట అభివృద్ధి పనులపై నిర్లక్ష్యం

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సిద్దిపేటలో పలు అభివృద్ధి పనులను నిలిపివేసిందని హరీశ్‌రావు ఆరోపించారు. పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ రహదారుల పనులు, వెటర్నరీ కళాశాల భవనం, ఎస్సీ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల, క్రీడా మైదానం, రంగనాయకసాగర్ పర్యాటక ప్రాజెక్టు, కోమటిచెరువు సమీపంలోని శిల్పారామం పనులు నిలిచిపోయాయని విమర్శించారు.

బీఎస్సీ అగ్రికల్చర్ కళాశాల భవనం, ఇంటిగ్రేటెడ్ పాఠశాల ప్రతిపాదనల విషయంలోనూ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. సిద్దిపేట పట్టణంతో పాటు చిన్నకోడూరు, దౌల్తాబాద్, దుబ్బాక ప్రాంతాల్లో రహదారుల పరిస్థితి అధ్వానంగా ఉందని, వాటి మరమ్మతులకు చర్యలు తీసుకోవాలని కోరారు.

వెయ్యి పడకల ఆసుపత్రిని ప్రారంభించాలి

సిద్దిపేట ప్రభుత్వ వెయ్యి పడకల ఆసుపత్రి నిర్మాణ పనులు 95 శాతం పూర్తయ్యాయని హరీశ్‌రావు తెలిపారు. మిగిలిన పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి సిద్దిపేటకు అంత పెద్ద ఆసుపత్రి ఎందుకని వ్యాఖ్యానించారని విమర్శించారు. పేద ప్రజలు గుండె, క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులకు చికిత్స కోసం హైదరాబాద్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికంగానే మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో ఈ ఆసుపత్రిని నిర్మించామని వివరించారు.

రాష్ట్రంలో 33 జిల్లాలను ఏర్పాటు చేసి, 33 మెడికల్ కళాశాలలకు అవకాశం కల్పించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. సిద్దిపేటలో ఐటీ టవర్ ఏర్పాటుతో స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రయత్నం జరిగిందన్నారు.

ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రిలో ఉచిత సేవలు

తనకు కంటి సమస్య వచ్చినప్పుడు ఎదురైన అనుభవంతో సిద్దిపేట ప్రజలకు కూడా అత్యున్నత స్థాయి కంటి వైద్యం అందించాలనే సంకల్పం కలిగిందని హరీశ్‌రావు తెలిపారు. అప్పటి కలెక్టర్ వెంకట్రామరెడ్డి సహకారంతో దుద్దెడ వద్ద స్థలం సేకరించి, హెటెరో డ్రగ్స్ డైరెక్టర్ రత్నాకర్‌రెడ్డి సహకారంతో రూ.5 కోట్ల నిధులు సమీకరించి ఏడాదిలోనే ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిని నిర్మించినట్లు చెప్పారు.

ఈ ఆసుపత్రిలో ఇప్పటివరకు రెండు లక్షల మందికి ఉచిత కంటి పరీక్షలు నిర్వహించగా, 20 వేల మందికి ఉచితంగా కంటి శస్త్రచికిత్సలు చేసినట్లు వెల్లడించారు.

రుణమాఫీపై ప్రభుత్వాన్ని నిలదీత

రైతు రుణమాఫీ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని హరీశ్‌రావు విమర్శించారు. 2024 మే 2న సిద్దిపేట పాత బస్టాండ్‌లో నిర్వహించిన సభలో కొమురవెల్లి మల్లన్నపై ఒట్టేసి రుణమాఫీ చేస్తానని చెప్పారని గుర్తుచేశారు. సిద్దిపేట నియోజకవర్గంలో 22 వేల మంది రైతులకు రుణమాఫీ జరిగితే, మరో 24 వేల మంది రైతులకు ప్రయోజనం అందలేదని ఆరోపించారు.రైతుబంధు, రైతుబీమా పథకాల అమలులోనూ రైతులకు అన్యాయం జరుగుతోందని విమర్శించారు. సాగునీరు, విద్యుత్ సరఫరా సమస్యలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. రైతుల పంటలు ఎండిపోకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని, సాగునీటి ప్రాజెక్టుల మోటార్లను నిరంతరాయంగా నడపాలని డిమాండ్ చేశారు.

సిద్దిపేట నుంచే మరో ఉద్యమం.

సిద్దిపేట జిల్లా ఏర్పాటు కోసం సహకరించిన దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డి, సతీష్‌బాబు, రసమయి బాలకిషన్, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డితో పాటు చేర్యాల, కొమురవెల్లి, హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ, దుబ్బాక, బెజ్జంకి ప్రాంతాల ప్రజలకు హరీశ్‌రావు కృతజ్ఞతలు తెలిపారు. పదవిలో ఉన్నా లేకున్నా తన జీవితాంతం సిద్దిపేట ప్రజల కోసమే పనిచేస్తానని ప్రకటించారు.ప్రభుత్వం అధికారికంగా దశాబ్ది ఉత్సవాలు నిర్వహించకపోయినా ప్రజలు, ప్రజాసంఘాలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి 10కే రన్, కవి సమ్మేళనం, బతుకమ్మ వేడుకలతో ఉత్సవాలను విజయవంతం చేశారని అన్నారు. సిద్దిపేటప్రజలకు కేసీఆర్ అందించిన జిల్లా, గోదావరి జలాలు, రైలుమార్గం, వైద్య విద్య వంటి అభివృద్ధి ఫలాలు చిరస్థాయిగా నిలుస్తాయని పేర్కొన్నారు.నాడు తెలంగాణ ఉద్యమానికి, కొత్త జిల్లాల ఏర్పాటుకు సిద్దిపేట వేదికగా నిలిచిందని, భవిష్యత్తులో కేసీఆర్ నాయకత్వంలో బీఆర్‌ఎస్ మళ్లీ అధికారంలోకి రావడానికి కూడా ఈ గడ్డ నుంచే ఉద్యమం ప్రారంభమవుతుందని హరీశ్‌రావు అన్నారు.ఈ సభలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు డాక్టర్ యాదవరెడ్డి, వెంకట్రామరెడ్డి, గజ్వేల్ ఇన్‌చార్జి ప్రతాప్‌రెడ్డి, తొలి జడ్పీ చైర్‌పర్సన్ రోజా రాధాకృష్ణశర్మ, మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ మంజుల రాజనర్సు, ఎర్రోళ్ల శ్రీనివాస్, బక్కి వెంకటయ్య, మాజీ ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్, మాజీ ఎమ్మెల్యే ఒడితెల సతీష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.