telanagana
రామకృష్ణాపూర్ ఏరియా ఆసుపత్రిలో చేతుల పరిశుభ్రతపై అవగాహన
సూర్య, రామకృష్ణాపూర్:రామకృష్ణాపూర్ ఏరియా ఆసుపత్రిలో డీవైసీఎంఓ డాక్టర్ మధుకుమార్ ఆధ్వర్యంలో చేతుల పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఆసుపత్రిలో పనిచేసే వైద్యులు, స్టాఫ్ నర్సులు, వార్డు అసిస్టెంట్లు, టెక్నీషియన్లు, వంట సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు సహా ప్రతి ఒక్కరూ చేతుల పరిశుభ్రతను తప్పనిసరిగా పాటించాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. సరైన పద్ధతిలో, తగిన సమయంలో చేతులు కడుక్కోవడం ద్వారా అంటువ్యాధులు ఒకరి నుంచి మరొకరికి వ్యాపించకుండా అరికట్టవచ్చని, డయేరియా వంటి వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చని వివరించారు. చేతులు శుభ్రం చేసుకునే సరైన విధానాన్ని ఆసుపత్రి సిబ్బందికి ప్రాయోగికంగా వివరించి అవగాహన కల్పించారు. మందమర్రి ఏరియా జీఎం ఎన్. రాధాకృష్ణ సహకారంతో, సీఎంఓ డాక్టర్ కిరణ్ రాజ్‌కుమార్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో సీనియర్ పీఓ మాథర్ సాహెబ్, మ్యాట్రన్ విజయకుమారి, ఓఎస్ కృష్ణమూర్తి, శానిటరీ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, యూనియన్ నాయకులు, వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.