పర్యావరణ పరిరక్షణకు యువ పారిశ్రామికవేత్త వినూత్న అడుగు -ప్రకృతి సిద్ధ ఉత్పత్తులతో ‘అవనిక్’ సంస్థకు శ్రీకారం
తణుకు, మేజర్ న్యూస్ : పర్యావరణ పరిరక్షణను సామాజిక బాధ్యతగా భావిస్తూ యువత వినూత్న ఆలోచనలతో పారిశ్రామిక రంగంలో అడుగుపెట్టడం శుభపరిణామమని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. తణుకు ప్రాంతానికి చెందిన యువ పారిశ్రామికవేత్త ప్రహీత్ ప్రకృతి సిద్ధ వనరులతో పర్యావరణహిత ఉత్పత్తులను అందించేందుకు ‘అవనిక్’ సంస్థను ప్రారంభించడాన్ని ఆయన అభినందించారు. ప్లాస్టిక్ వినియోగానికి ప్రత్యామ్నాయాలను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో చేపట్టిన ఈ ప్రయత్నం ఇతర యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.‘ఫ్రమ్ ద నేచర్.. బ్యాక్ టు ద నేచర్’ అనే నినాదంతో ప్రకృతి నుంచి లభించే వనరులను వినియోగించి, తిరిగి ప్రకృతిలో కలిసిపోయే ఉత్పత్తులకు ప్రాధాన్యమివ్వడం ఈ సంస్థ ప్రత్యేకతగా ఎమ్మెల్యే వివరించారు. బయోడిగ్రేడబుల్ క్యారీ బ్యాగులు, కొబ్బరి పొట్టు వంటి సహజ వనరులతో తయారైన గ్లాసులు, వక్క ఆకులతో రూపొందించిన ప్లేట్లు, వెదురుతో తయారు చేసిన టూత్ బ్రష్‌లు, పెన్నులు తదితర ఉత్పత్తులను ‘అవనిక్’ ద్వారా అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ ఉద్యోగాల కోసం ఎదురుచూడటంతో పాటు స్వయం ఉపాధి అవకాశాలను సృష్టించే దిశగా యువత ఆలోచించాలని ఎమ్మెల్యే సూచించారు. స్థానికంగా లభించే సహజ వనరులను వినియోగిస్తూ సమాజ అవసరాలకు అనుగుణంగా పరిశ్రమలను నెలకొల్పడం ద్వారా పారిశ్రామికాభివృద్ధికి అవకాశాలు ఏర్పడతాయన్నారు. ప్రకృతిని కాపాడుకోవడం భావితరాలకు మనం అందించే విలువైన వారసత్వమని పేర్కొన్న ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, యువ పారిశ్రామికవేత్త ప్రహీత్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. ‘అవనిక్’ సంస్థ మరింత అభివృద్ధి చెంది పర్యావరణ పరిరక్షణతో పాటు స్థానికంగా ఉపాధి అవకాశాల కల్పనకు దోహదపడాలని ఆకాంక్షించారు.
రిపోర్టర్ అని కుమార్ తణుకు పశ్చిమగోదావరి జిల్లా,