మేయర్ నిరంకుశ పోకడలు, మార్కెట్ కమిటీ చైర్మన్‌పై ఆరోపణలు కాంగ్రెస్ సీనియర్ నాయకుల విలేకరుల సమావేశంలో ఘాటు విమర్శలు
సూర్య మంచిర్యాల టౌన్ : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మంథని జగన్మోహన్ రావు నివాసంలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు వేములపల్లి సంజీవ్, వనపర్తి రాజేష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఇర్ఫాన్, అజర్‌లు పలు రాజకీయ అంశాలపై స్పందిస్తూ ప్రత్యర్థులపై తీవ్ర విమర్శలు చేశారు.
రామగిరి బానేష్‌పై సంజీవ్ విమర్శలు
మాజీ మున్సిపల్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ వేములపల్లి సంజీవ్ మాట్లాడుతూ మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్ చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ వ్యవహారశైలిపై విమర్శలు చేస్తూ, ఆయన అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారాలపై ప్రజలకు వాస్తవాలు తెలియజేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
మేయర్ వైఖరిపై వనపర్తి రాజేష్ ఆగ్రహం
నాయకుడు వనపర్తి రాజేష్ మాట్లాడుతూ మున్సిపాలిటీలో మేయర్ అనుసరిస్తున్న నిరంకుశ వైఖరిని తీవ్రంగా విమర్శించారు. మున్సిపల్ పాలనలో మహిళా కార్పొరేటర్ల పట్ల వివక్ష చూపుతున్నారని, దళిత కార్పొరేటర్ల విషయంలోనూ అనుచితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.ప్రజాప్రతినిధులందరికీ సమాన గౌరవం కల్పిస్తూ, ప్రజాస్వామ్యబద్ధంగా పాలన సాగించాలని సూచించారు.
ఉప్పలయ్యకు జలీల్ వెన్నుపోటు పొడిచారు: ఇర్ఫాన్
మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఇర్ఫాన్ మాట్లాడుతూ ఉప్పలయ్యపై జలీల్ నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. జలీల్‌కు రాజకీయ భవిష్యత్తును అందించడంలో ఉప్పలయ్య కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. అలాంటి వ్యక్తిపైనే నిరాధార వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. రాజకీయంగా అవకాశాలు కల్పించిన వ్యక్తికి జలీల్ వెన్నుపోటు పొడిచారని విమర్శిస్తూ,ఆయన వైఖరిని కట్టప్పతో పోల్చారు.
ఓటమికి ఇతరులను బాధ్యులను చేయొద్దు: అజర్
నాయకుడు అజర్ మాట్లాడుతూ మంథని జగన్మోహన్ రావుపై అర్కల హేమలత చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.ఎన్నికల్లో ఎదురైన ఓటమికి ఇతరులను బాధ్యులను చేయడం సరికాదని, తన ఓటమికి సంబంధించిన కారణాలను ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. భవిష్యత్తులో నిరాధారమైన, అనుచిత ఆరోపణలు చేస్తే సహించబోమని హెచ్చరించారు.