దసరా సెలవుల్లో అప్రమత్తంగా ఉండాలి రూరల్ ఎస్సై నవత
సిద్దిపేట రూరల్, మేజర్ న్యూస్: దసరా సెలవులు, తొమ్మిది రోజుల బతుకమ్మ సంబరాల సందర్భంగా సిద్దిపేట రూరల్, నారాయణరావుపేట మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రూరల్ ఎస్సై నవత సూచించారు. పండుగలను సంతోషంగా జరుపుకోవడంతో పాటు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని కోరారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దసరా సెలవుల్లో సొంతూళ్లకు వెళ్లేవారు ఇళ్లకు తాళాలు వేసి వెళ్లే ముందు తలుపులు, కిటికీలు సక్రమంగా మూసివేయాలని, నగదు, బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులను సురక్షితంగా భద్రపరచుకోవాలని సూచించారు. తాము ఊరికి వెళ్తున్న విషయాన్ని నమ్మకమైన ఇరుగుపొరుగు వారికి తెలియజేయాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా ఘటనలు జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 112కు ఫోన్ చేయాలని కోరారు. బతుకమ్మ వేడుకల్లో పాల్గొనే మహిళలు తమ పిల్లల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఎస్సై సూచించారు. పిల్లల వద్ద బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులు ఉంచకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. బతుకమ్మ ఆడే సమయంలో చెరువులు, కుంటల వద్ద పిల్లలు నీటిలోకి వెళ్లకుండా తల్లిదండ్రులు నిరంతరం గమనించాలని సూచించారు. పండుగ వేడుకల్లో అప్రమత్తంగా ఉంటూ తొమ్మిది రోజుల బతుకమ్మ సంబరాలను సంతోషంగా జరుపుకోవాలని కోరారు.అలాగే దసరా సెలవుల్లో విద్యార్థులు జాగ్రత్తలు పాటించాలని, తల్లిదండ్రులకు తెలియకుండా బయటకు వెళ్లకూడదని సూచించారు. చెరువులు, కుంటలు, కాలువల వద్దకు ఒంటరిగా వెళ్లకూడదని, రోడ్లపై ప్రమాదకరంగా ఆటలు ఆడటం, వాహనాలు నడపడం వంటి పనులకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. సెల్‌ఫోన్‌ను పరిమితంగా వినియోగిస్తూ చదువు, ఆటలు, వ్యాయామంపై దృష్టి పెట్టాలని తెలిపారు. తెలియని వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా సమస్య ఎదురైతే వెంటనే తల్లిదండ్రులకు తెలియజేయాలని సూచించారు. ప్రజలు, మహిళలు, విద్యార్థులు పోలీసుల సూచనలు పాటిస్తూ ఇళ్ల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, పిల్లల పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆమె విజ్ఞప్తి చేశారు. అందరూ పోలీసులకు సహకరించి దసరా, బతుకమ్మ పండుగలను ప్రశాంతంగా, సురక్షితంగా జరుపుకోవాలని కోరారు.