చేతిలో చీపురు.. పరిశుభ్రతపై పిలుపు - బస్టాండ్‌లో ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు శ్రమదానం.. మొక్కలు నాటి, ప్రయాణికులకు పండ్ల పంపిణీ
సూర్య కాగజ్‌నగర్ :పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్‌బాబు స్వయంగా చీపురు పట్టి శ్రమదానం చేశారు. మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని కాగజ్‌నగర్ ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో శుక్రవారం నిర్వహించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వయంగా చీపురు పట్టుకుని బస్టాండ్ ప్రాంగణంలోని చెత్తను తొలగించారు. బాత్రూమ్ లను సైతం శుభ్రం చేశారు. పరిసరాలను శుభ్రం చేస్తూ పరిశుభ్రత ప్రాధాన్యతను ప్రజలకు చాటిచెప్పారు. అనంతరం బస్టాండ్ ఆవరణలో మొక్కలు నాటారు. ప్రయాణికులకు , నిరుపేదలకు పండ్లను పంపిణీ చేశారు.
- పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత:
పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించవచ్చని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పరిశుభ్రతను పాటించడం కేవలం ప్రభుత్వ శాఖల బాధ్యత కాదని, ప్రతి పౌరుడు తన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. మహాత్మా గాంధీ చూపిన పరిశుభ్రత మార్గాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు, కార్యకర్తలు, ఆర్టీసీ, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.