బాల్య వివాహ రహితమే లక్ష్యం
రేణిగుంట: 2030 నాటికి భారతదేశాన్ని బాల్యవివాహ రహిత దేశంగా మార్చే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగా గాంధీ జయంతి సందర్భంగా తిరుపతి జిల్లాలోని 35 మండలాల్లో 807 గ్రామ పంచాయతీలలో ప్రత్యేక గ్రామసభలు నిర్వహించి బాల్యవివాహ రహిత గ్రామాలుగా తీర్మానాలు చేశారు. కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీలు తమ గ్రామాలను బాల్యవివాహ రహిత గ్రామాలగా ప్రకటిస్తూ తీర్మానాలు చేయాలని సూచనలు జారీ అయ్యాయి. ఈ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారి సంబంధిత జిల్లా అధికారుల సూచనలతో ఎంపీడీవోల ద్వారా గ్రామ పంచాయతీలకు అవసరమైన ఆదేశాలు, సూచనలు అందించబడ్డాయి.ఈ కార్యక్రమంలో భాగంగా అక్టోబర్ 2న గాంధీ జయంతి పురస్కరించుకుని నిర్వహించిన గ్రామసభల్లో జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ అలయన్స్‌లో భాగమైన ప్రగతి సంస్థ సిబ్బంది శ్రీకాళహస్తి, తొట్టంబేడు, కె.వి.పురం, వరదయ్యపాలెం, పుత్తూరు చంద్రగిరి మండలాల్లో ప్రత్యేకంగా పాల్గొని గ్రామసభల్లో బాల్యవివాహాల వల్ల బాలికల విద్య, ఆరోగ్యం, భద్రత భవిష్యత్తుపై కలిగే ప్రభావాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. తమ గ్రామంలో బాల్యవివాహాలు జరగకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, బాల్యవివాహం జరుగుతున్నట్లు సమాచారం తెలిసిన వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేయాలని చెప్తూ బాల్యవివాహాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు. గ్రామసభల్లో బాల్యవివాహాల నిర్మూలనకు గ్రామస్థులంతా సమిష్టిగా కృషి చేయాలని నిర్ణయించుకుని తమ గ్రామాలను బాల్యవివాహ రహిత గ్రామాలగా ప్రకటిస్తూ గ్రామ పంచాయతీల ద్వారా తీర్మానాలు చేశారు. బాల్యవివాహాల నిర్మూలన కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని తల్లిదండ్రులు ప్రజాప్రతినిధులు ఉపాధ్యాయులు, యువత, స్వచ్ఛంద సంస్థలు సమాజంలోని ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ప్రగతి సంస్థ పిలుపు నిచ్చింది.బాల్యవివాహాలకు ముగింపు ప్రతి బాలికకు విద్య, భద్రత, హక్కులు అనే లక్ష్యంతో ప్రజల్లో నిరంతర అవగాహన కల్పిస్తూ, బాల్యవివాహ రహిత గ్రామాల నిర్మాణానికి ప్రగతి సంస్థ తన వంతు సహకారం కొనసాగిస్తుందని తెలిపారు.