ఉద్యమాలతోనే సమస్యల పరిష్కారం : ఎస్ఎఫ్ఐ
నారాయణపేట, సూర్యన్యూస్:
నారాయణపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాలలకు నూతన భవనాలు నిర్మించాలని డిమాండ్ చేస్తూ భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ నారాయణపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన నాలుగు రోజుల దీక్షను విజయవంతం చేసిన విద్యార్థులకు, సహకరించిన ఉపాధ్యాయులకు, పత్రికా మీడియా మిత్రులకు, సోషల్ మీడియా వేదికల ద్వారా ఉద్యమానికి విస్తృత ప్రచారం కల్పించి సమస్యలను ప్రజల దృష్టికి తీసుకెళ్లిన మీడియా మిత్రులకు ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసింది. ఈ సందర్భంగా ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాలలకు నూతన భవనాల నిర్మాణ పనులను త్వరలో ప్రారంభిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ నారాయణపేట జిల్లా మాజీ అధ్యక్షుడు కుంభం శివకుమార్ రెడ్డికి ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసింది. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఇచ్చిన హామీని ప్రభుత్వం వెంటనే అమలు చేసి, దసరా పండుగలోపు నిర్మాణ పనులు ప్రారంభించాలని ఈ సందర్భంగా కోరింది. నారాయణపేట జిల్లా కమిటీ సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యుడు నరహరి మాట్లాడుతూ, జిల్లాలో విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఎస్ఎఫ్ఐ నిరంతరం పోరాటాలు కొనసాగిస్తుందని అన్నారు. నాలుగు రోజుల దీక్షకు విద్యార్థులు అందించిన సహకారం, వారి భాగస్వామ్యం అభినందనీయమని పేర్కొన్నారు. విద్యార్థుల సమస్యలను చర్చించి, వాటి పరిష్కారం కోసం భవిష్యత్తులో మరిన్ని ఉద్యమాలు చేపడతామని తెలిపారు. ఈ సమావేశంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు భానుప్రసాద్, జిల్లా కార్యదర్శి పవన్ కుమార్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
-- *రాజేష్ కుమార్, సూర్య రిపోర్టర్ నారాయణపేట*