పర్వతాలుకు డాక్టరేట్ ప్రదానం చేసిన హైదరాబాద్ విశ్వవిద్యాలయం
నేరడుగొమ్ము,మేజర్ న్యూస్:- ప్రతిష్టాత్మక హైదరాబాద్ విశ్వవిద్యాలయం గురువారం నిర్వహించిన 26వ స్నాతకోత్సవంలో నేరడుగొమ్ము మండలంలోని తిమ్మాపురం గ్రామానికి చెందిన పంబాల పర్వతాలుకు డాక్టరేట్ పట్టా ప్రదానం చేశారు.“పంబా ప్రదర్శన కళ – సాహిత్య, సాంస్కృతిక,సామాజిక అంశాల అధ్యయనం”అనే అంశంపై పర్వతాలు చేసిన పరిశోధనకు గాను ఈ డాక్టరేట్‌ను అందజేశారు. తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల సమక్షంలో యూనివర్సిటీ ఛాన్సలర్ జస్టిస్ ఎల్.నర్సింహా రెడ్డి,వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ అనురాధ చేతుల మీదుగా పంబాల పర్వతాలు డాక్టరేట్ పట్టాను స్వీకరించారు.ఈ సందర్భంగా పంబాల పర్వతాలు మాట్లాడుతూ, విద్యా ప్రస్థానంలో డాక్టరేట్ పట్టా ఒక చిరస్మరణీయమైన మైలురాయని,ఈ స్థాయికి చేరుకోవడానికి సహకరించిన గురువులు,కుటుంబ సభ్యులు, మిత్రులు,శ్రేయోభిలాషులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. తిమ్మాపురం గ్రామానికి చెందిన పర్వతాలు ఉన్నత విద్యలో సాధించిన ఈ ఘనత పట్ల గ్రామస్థులు,కుటుంబ సభ్యులు, మిత్రులు,విద్యావేత్తలు,శ్రేయోభిలాషులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.