రైతుబంధు డా.ఆర్‌ఎస్‌ఎస్‌కు మహాత్మా గాంధీ స్మారక విశిష్ట సేవా పురస్కారం
• స్వతంత్ర శాస్త్రవేత్త డా.రామిశెట్టి శివశంకర్‌కు ఘన సత్కారం
• దివ్యాంగుల సేవకు గుర్తింపుగా ప్రతిష్ఠాత్మక పురస్కారం
• 15 మంది దివ్యాంగ విద్యార్థులకు ప్రతిభా ప్రోత్సాహకాలు
• డా.ఆర్‌ఎస్‌ఎస్ రీసెర్చ్ ఫౌండేషన్ సహకారంతో కార్యక్రమం
పామూరు, మేజర్ న్యూస్ :
గాంధీజీ ఆశయాల స్ఫూర్తితో రైతులు, దివ్యాంగుల సంక్షేమానికి విశేష సేవలందిస్తున్న స్వతంత్ర శాస్త్రవేత్త డా.రామిశెట్టి శివశంకర్ (డా.ఆర్‌ఎస్‌ఎస్)ను మహాత్మా గాంధీ స్మారక విశిష్ట సేవా పురస్కారంతో ఘనంగా సత్కరించారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం పులివెందుల పట్టణంలోని పుల్లారెడ్డి ఆసుపత్రి సమీపంలో గల వికలాంగుల కమ్యూనిటీ భవనంలో ఆంధ్రప్రదేశ్ దివ్యాంగుల నెట్‌వర్క్ రాష్ట్ర అధ్యక్షుడు డా.ఇరికిరెడ్డి రఘునాథరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. రైతుబంధుగా, దివ్యాంగులకు ఆత్మీయుడిగా సేవలందిస్తున్న డా.ఆర్‌ఎస్‌ఎస్‌కు ‘మహాత్మా గాంధీ మెమోరియల్ ఎక్సలెన్స్ సర్వీస్ అవార్డు’ను అందజేసి సత్కరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మారుతి హాస్పిటల్ డాక్టర్ ఎన్.చక్రపాణి, ఏపీ సీనియర్ జర్నలిస్టు, ఆధ్యాత్మిక పరిశోధకుడు అల్లం రంగనాయకులు, ఆదర్శ రైతు రామిరెడ్డి హాజరయ్యారు. డా.ఆర్‌ఎస్‌ఎస్ రీసెర్చ్ ఫౌండేషన్ సహకారంతో 15 మంది దివ్యాంగ విద్యార్థులకు ప్రతిభా ప్రోత్సాహకాలను అందజేశారు. కార్యక్రమంలో దివ్యాంగులు, మానసిక వికలాంగులు, వారి తల్లిదండ్రులు, కుట్టు మిషన్ మహిళా సంఘాల అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు.