ప్రజలకు సేవలందిస్తున్న ఆశా, అంగన్‌వాడీ, ఆర్‌పీలు, మహిళా సంఘాల ప్రతినిధుల సేవలు అభినందనీయం : ఎంపీ డీకే అరుణ, జిల్లా కలెక్టర్ ప్రియాంక.
నారాయణపేట, సూర్య న్యూస్:
ప్రజలకు అంకితభావంతో సేవలందిస్తున్న ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ టీచర్లు, అంగన్‌వాడీ ఆయాలు, ఆర్‌పీలు, మహిళా సంఘాల ప్రతినిధుల సేవలు అభినందనీయమని పాలమూరు పార్లమెంట్ సభ్యురాలు, తమిళ నాడు రాష్ట్ర బీజేపీ సహా ఇంచార్జీ డీ కే అరుణ పేర్కొన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 25 సంవత్సరాల ప్రజల సేవ ద్వారా దేశ సేవా సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నారాయణపేట జిల్లా కేంద్రంలోని శ్రీ గార్డెన్స్ లో అంగన్ వాడీ టీచర్లు, ఆయాలు, ఆశా వర్కర్లు, ఆర్పిల కు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎంపీ డీకే అరుణ, జిల్లా కలెక్టర్ ప్రియాంక ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ... ప్రజలకు సేవ చేయడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, సమాజ అభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు.
గ్రామీణ ప్రాంతాల్లో గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు ఆరోగ్యం, పోషకాహారం, టీకాలు, పారిశుధ్యంపై అవగాహన కల్పించడంలో ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. గర్భిణి ఆరోగ్యంగా ఉంటే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుందని, చిన్నారులకు బాల్య దశ నుంచే పోషకాహారం, ఆరోగ్యం, విద్యపై శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉందన్నారు.
అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు పౌష్టికాహారం అందించడంతో పాటు ప్రాథమిక విద్య, ఆటల ద్వారా అభ్యసనకు అవసరమైన వాతావరణాన్ని కల్పిస్తున్న సిబ్బంది సేవలను అభినందించారు. ప్రతి కుటుంబం తమ పిల్లలను పాఠశాలలకు పంపించి నాణ్యమైన విద్య అందించేలా తల్లిదండ్రుల్లో అవగాహన పెరగడం సమాజంలో వచ్చిన సానుకూల మార్పుకు నిదర్శనమన్నారు.
మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్య సాధనలో పారిశుధ్యం, పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఉందన్నారు. ప్రతి గ్రామంలో పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించేందుకు ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ద్వారా అనేక వ్యాధులను నివారించవచ్చని తెలిపారు.
మహిళా సంఘాల ద్వారా మహిళలకు ఆర్థిక అవగాహన కల్పిస్తూ, బ్యాంకు రుణాలు, ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకునేలా ఆర్‌పీలు, సంబంధిత సిబ్బంది చేస్తున్న కృషిని అభినందించారు. ప్రతి మహిళ ఆర్థికంగా స్వావలంబన సాధించి, ఆత్మవిశ్వాసంతో కుటుంబాన్ని ఉన్నత స్థితికి తీసుకెళ్లేలా ప్రోత్సహించాలన్నారు. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు.
ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ సిబ్బంది తమ వేతనాలు, ఇతర సమస్యలను కార్యక్రమంలో ప్రస్తావించగా, వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని తెలిపారు.
ప్రభుత్వ పథకాల అమలులో ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ సిబ్బంది, ఆర్‌పీలు, బూత్ లెవల్ అధికారులు తదితరులు కీలకంగా పనిచేస్తున్నారని, వారికి అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నందుకు అభినందనలు తెలిపారు. మహాత్మా గాంధీ జయంతి రోజున అంగన్ వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, ఆర్పి లను సన్మానించడం జరుగుతుందని ఆమె తెలిపారు. గ్రామాల అభివృద్ధి ద్వారానే రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి ద్వారానే దేశ అభివృద్ధి సాధ్యమవుతుందని ఎంపీ అరుణ పేర్కొన్నారు. వికసిత్ భారత్–2047 లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. గ్రామీణాభివృద్ధి, మహిళా సాధికారత, రైతుల సంక్షేమం, పట్టణాభివృద్ధి తదితర రంగాల్లో సమష్టిగా కృషి చేయాలని ఎంపీ కోరారు.
*గ్రామీణాభివృద్ధిలో అంగన్‌వాడీలు, ఆశా కార్యకర్తల పాత్ర కీలకం : జిల్లా కలెక్టర్ ప్రియాంక*
గాంధీ జయంతి సందర్భంగా అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు తదితర మహిళా క్షేత్రస్థాయి సిబ్బందిని సన్మాన కార్యక్రమానికి హాజరైన ఎంపీ డీకే అరుణ మున్సిపల్ చైర్ పర్సన్ కొండా శ్వేతా సత్య యాదవ్, ప్రజాప్రతినిధులు, అధికారులు, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలకు ముందుగా కలెక్టర్ ప్రియాంక అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సాకారం కావాలంటే గ్రామాల అభివృద్ధి అత్యంత కీలకమని అన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం సమగ్రంగా అభివృద్ధి చెందుతుందని ఆమె పేర్కొన్నారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరడంలో అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలు, ఇతర ఫ్రంట్‌లైన్ సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. ప్రజలకు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడంతో పాటు వాటి ప్రయోజనాలను అర్హులకు అందించడంలో వారి సేవలు ఎంతో విలువైనవని అన్నారు. ఆశా కార్యకర్తలు గర్భిణీ మహిళలకు నిరంతరం ఆరోగ్య సేవలు, వైద్య సలహాలు అందిస్తూ ప్రసవానికి ముందస్తు ప్రణాళిక, ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పిస్తున్నారని కలెక్టర్ పేర్కొన్నారు. అంగన్‌వాడీ కార్యకర్తలు మహిళలు, చిన్నారులకు పోషకాహారం అందేలా చర్యలు తీసుకోవడంతో పాటు ఆరోగ్యకరమైన ఆహారం, పోషకాహారంపై అవగాహన కల్పిస్తున్నారని తెలిపారు.
భవిష్యత్ తరాల ఆరోగ్యం, సంక్షేమం క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న మహిళా సిబ్బంది సేవలతో ముడిపడి ఉందని కలెక్టర్ అన్నారు. మహిళలు, పిల్లల ఆరోగ్యం, పోషణ, సంక్షేమం కోసం అంకితభావంతో పనిచేస్తున్న ప్రతి ఒక్కరినీ అభినందించారు.
అదేవిధంగా బాల్య వివాహాల నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. నారాయణపేట జిల్లాను బాల్య వివాహాల రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు క్షేత్రస్థాయి సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. బాల్య వివాహాల నివారణకు సంబంధించిన అవగాహన కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించాలని అన్నారు.
నారాయణపేట జిల్లాను రాష్ట్రంలో అన్ని రంగాల్లో ముందంజలో నిలిపేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ కోరారు. జిల్లాకు అవసరమైన వనరులు, సౌకర్యాల కల్పనకు ప్రజాప్రతినిధుల సహకారం కొనసాగాలని ఆకాంక్షించారు.
మహిళల సమస్యలను సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి సమన్వయంతో కృషి చేస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు. అనంతరం ప్రజలకు నిరంతరం సేవలందిస్తున్న ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు, ఆర్‌పీలు, మహిళా సంఘాల ప్రతినిధులను జిల్లా కలెక్టర్ ప్రియాంక తో కలిసి ఎంపీ డీకే అరుణ ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ కొండా శ్వేతా సత్య యాదవ్, వైస్ చైర్ పర్సన్ మంజుల, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రతంగ్ పాండ్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు సత్య యాదవ్, డీ డబ్ల్యు ఓ రాజేందర్ గౌడ్, డిప్యూటీ డీ ఎం అండ్ హెచ్ ఓ సిద్ధప్ప, బీజేపీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు విమల, బీజేపీ ఓ బీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘు రామయ్య గౌడ్, బీజేపీ రాష్ట్ర, జిల్లా పార్టీల ముఖ్య బాధ్యులు,నాయకులు పాల్గొన్నారు.
-- *రాజేష్ కుమార్, సూర్య రిపోర్టర్ నారాయణపేట*