పీఎం–సూర్యఘర్ పై ప్రత్యేక అవగాహన - 17 నుంచి అక్టోబరు 17 వరకు ‘సేవా సేతు' క్యాంప్ -రూఫ్‌టాప్ సోలార్ ఏర్పాటుతో విద్యుత్ బిల్లుల భారం తగ్గింపు -ఏపీఎస్పీడీసీఎల్ సిఎండి శివశంకర్ లోతేటి వెల్లడి
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పీఎం–సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజనపై ప్రజల్లో అవగాహన కల్పించి, రూఫ్‌టాప్ సోలార్ విద్యుత్ వ్యవస్థల ఏర్పాటును ప్రోత్సహించేందుకు కృషి చేస్తున్నామని ఏపీఎస్పీడీసీఎల్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలోని 9 జిల్లాల్లో ఈనెల 17 నుంచి అక్టోబర్ 17వతేదీ వరకు ‘సేవా సేతు' క్యాంప్ ను నిర్వహించడం జరుగుతోందన్నారు.
పీఎం-సూర్యఘర్ పథకం ద్వారా గృహ వినియోగదారులు తమ ఇళ్లపై రూఫ్‌టాప్ సోలార్ విద్యుత్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకుని, సౌర విద్యుత్‌ను వినియోగించుకోవచ్చని తెలియజేశారు. తద్వారా సంప్రదాయ విద్యుత్‌పై ఆధారపడటాన్ని తగ్గించుకోవడంతో పాటు విద్యుత్ బిల్లుల భారాన్ని కూడా తగ్గించుకునే అవకాశం ఉంటుందని వివరించారు.
కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ..
పీఎం–సూర్యఘర్ పథకం కింద రూఫ్‌టాప్ సోలార్ వ్యవస్థల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం 1 కిలోవాట్ సామర్థ్యానికి రూ.30,000, రెండు కిలోవాట్ల సామర్థ్యానికి రూ.60,000, మూడు కిలోవాట్ల సామర్థ్యానికి రూ.78,000 సబ్సిడీని అందిస్తుందని తెలిపారు.
అర్హత కలిగిన గృహ వినియోగదారులు ఈ పథకం ద్వారా లభించే సబ్సిడీ ప్రయోజనాలను పొందవచ్చన్నారు. వినియోగదారులు ఏ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
గాంధీజీ, లాల్ బహదూర్ శాస్త్రి ఆశయాల సాధనకు కృషి
మహాత్మా గాంధీజీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రిల ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ తమవంతు కృషి చేయాలని ఏపీఎస్పీడీసీఎల్ డైరెక్టర్ (టెక్నికల్) కె. గురవయ్య, డైరెక్టర్ (ప్రాజెక్ట్స్ & ఐటీ) పి. అయూబ్ ఖాన్ లు పిలుపునిచ్చారు. సందర్భంగా ఏపీఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం (విద్యుత్ నిలయం)లో శుక్రవారం మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రిల జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీజీ, లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా డైరెక్టర్లు మాట్లాడుతూ మహాత్మా గాంధీజీ సత్యం, అహింస, శాంతి, మానవతా విలువలను తన జీవితంలో ఆచరించి, స్వాతంత్ర్య ఉద్యమానికి ప్రజలను ఏకతాటిపైకి తీసుకువచ్చారని తెలిపారు. అహింసా మార్గంలో అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించి దేశానికి స్వాతంత్ర్యం సాధించడంలో కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. లాల్ బహదూర్ శాస్త్రి సరళత, నిజాయితీ, క్రమశిక్షణ, నిబద్ధతకు ప్రతీకగా నిలిచారని తెలిపారు. దేశానికి ప్రధానమంత్రిగా పనిచేసిన సమయంలో దేశ ప్రయోజనాలను అత్యున్నతంగా భావించి, ప్రజల్లో దేశభక్తి, బాధ్యతాభావాన్ని పెంపొందించేందుకు కృషి చేశారని గుర్తుచేశారు. “జై జవాన్, జై కిసాన్” అనే నినాదంతో దేశ రక్షణ, వ్యవసాయ రంగాల ప్రాధాన్యతను చాటిచెప్పారని తెలిపారు. ఈ కార్యక్రమంలో చీఫ్ జనరల్ మేనేజర్లు సిహెచ్ రామచంద్ర రావు, ఎం. మురళి కుమార్, ఎం.శ్రీకాంత్, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ కే. జనార్దన్ నాయుడు, ప్రత్యేక అధికారి యం. ఉమాపతి, జనరల్ మేనేజర్ శ్రీనివాసులు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
సీఎం గౌడ్ తిరుపతి ప్రతినిధి