గిరిజన గురుకుల పాఠశాలలో ఘనంగా గాంధీజీ 157వ జయంతి...
కావలి మేజర్ న్యూస్ : పట్టణంలోని గిరిజన గురుకుల బాలుర పాఠశాలలో జాతిపిత మహాత్మా గాంధీ 157వ జయంతి వేడుకలు శుక్రవారం అత్యంత వైభవంగా జరిగాయి. పాఠశాల ప్రిన్సిపాల్ నరేంద్ర శ్యామ్ సుధాకర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి స్వచ్ఛంద సంస్థల గౌరవ అధ్యక్షులు షేక్ బాషా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా గాంధీ మహాత్ముని చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, గుజరాత్‌లోని పోరుబందర్‌లో జన్మించిన గాంధీజీ, అహింసా మార్గంలో స్వాతంత్య్ర ఉద్యమాన్ని నడిపి దేశానికి స్వేచ్ఛను ప్రసాదించిన మహనీయుడని కొనియాడారు. హింసకు తావులేకుండా శాంతియుత పోరాటంతో బ్రిటిష్ పాలనను నిర్వీర్యం చేసిన ఆయన ఆశయాలు, మహోన్నత ఆదర్శాలు నేటి తరానికి ఎంతో ఆదర్శనీయమని పేర్కొన్నారు. అనంతరం మహనీయుని ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో హ్యాపీ సేవా సంస్థ ప్రతినిధి ఎస్.డి. ఘని బాషా, గుడ్ మెన్ సేవా సంస్థ ప్రతినిధి సోమిశెట్టి బ్రహ్మయ్య, పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ తుళ్లూరు రవి, ఉపాధ్యాయులు రాజు, ఉపాధ్యాయుేతర సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.