బతుకమ్మ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు సర్పంచ్ యాద భార్గవి చందు
సిద్దిపేట రూరల్, మేజర్ న్యూస్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని బంజేరుపల్లి గ్రామ సర్పంచ్ యాద భార్గవి చందు అన్నారు. ఆదివారం నారాయణరావుపేట మండలం బంజేరుపల్లి గ్రామంలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ప్రకృతి ఆరాధనకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ పాటలతో జరుపుకునే ఈ పండుగ తెలంగాణ ప్రత్యేకతను చాటిచెబుతుందని అన్నారు. తరతరాలుగా వస్తున్న సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుంటూ భావితరాలకు అందించాలని సూచించారు.గ్రామంలోని మహిళలు, యువతులు, ప్రజలందరూ ఐకమత్యంతో బతుకమ్మ వేడుకల్లో పాల్గొని పండుగను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. బతుకమ్మ పండుగ ప్రతి ఇంటా సుఖసంతోషాలు నింపాలని, గ్రామ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు.