సీనియర్ సిటిజన్ల సంక్షేమం కోసం వయో సమ్మాన్ రాష్ట్రీయ అభియాన్
సూర్య జాతీయ డెస్క్: వృద్ధుల సంక్షేమం, సంరక్షణ మరియు సామాజిక సమాలంబనను పెంపొందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైన జాతీయ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అటల్ వాయో అభ్యుదయ యోజన (ఏవీవైఏవై) కింద కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత శాఖ మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ ఆధ్వర్యంలో 'వయో సమ్మాన్ రాష్ట్రీయ అభియాన్' (జాతీయ తరాల మధ్య అనుసంధాన ప్రచారం) ప్రారంభం కానుంది. తరాల మధ్య అంతరాన్ని తగ్గించి, సీనియర్ సిటిజన్ల పట్ల యువతలో గౌరవ భావాన్ని పెంపొందించే ఉద్దేశంతో ఈ దేశవ్యాప్త ఉద్యమాన్ని రూపొందించారు.
ఈ ప్రత్యేక అభియాన్‌లో భాగంగా 18 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు గల పౌరులను వాలంటీర్లుగా సమీకరించి, వృద్ధుల సంక్షేమం కోసం భాగస్వామ్యం కల్పిస్తారు. ఆధునిక కాలంలో మారుతున్న సామాజిక పరిస్థితులు, వలసలు మరియు ఉరుకుల పరుగుల జీవితం కారణంగా తరాల మధ్య తగ్గిపోతున్న సంబంధాలను మళ్లీ బలపడతాని ప్రభుత్వం భావిస్తోంది. సీనియర్ సిటిజన్ల అనుభవాలు, విజ్ఞానం మరియు సాంస్కృతిక వారసత్వాన్ని యువతకు అందించడం, అలాగే వృద్ధులకు సాంకేతికత మరియు సమకాలీన అంశాలపై యువత అండగా నిలవడం ఈ ప్రచార ప్రధాన ఉద్దేశం.
ఈ జాతీయ ప్రచారాన్ని కనెక్ట్, కాన్వర్స్, కో-క్రియేట్, కంట్రిబ్యూట్ మరియు కంటిన్యూ అనే వినూత్నమైన 5సీ మోడల్ ఆధారంగా అమలు చేయనున్నారు. డిజిటల్ అక్షరాస్యత, ఆరోగ్య అవగాహన, నైపుణ్యాల భాగస్వామ్యం వంటి 12 ప్రధాన రంగాలలో ఈ కార్యక్రమాలు కొనసాగుతాయి. ఈ ప్రచారంలో పాల్గొనేందుకు ఆసక్తి గల యువత జీవన్ యాప్ లేదా ఎస్సీడబ్ల్యూ సమావేశ్ పోర్టల్ ద్వారా 'వయో సాథీ' వాలంటీర్లుగా పేర్లు నమోదు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. వృద్ధులకు గౌరవప్రదమైన మరియు భద్రమైన జీవితాన్ని అందించడంలో ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది.