national
జమ్మూ కాశ్మీర్ రాజకీయాల్లో కుదుపు: ఎన్సీకి మెహదీ రాజీనామా
శ్రీనగర్:జమ్మూ కాశ్మీర్ అధికార నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) పార్టీలో తీవ్ర కలకలం రేగింది. శ్రీనగర్ లోక్‌సభ నియోజకవర్గ ఎంపీ ఆగా సయ్యద్ రుహుల్లా మెహదీ పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు తన లోక్‌సభ సభ్యత్వానికి సంచలన రాజీనామా ప్రకటించారు. ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, పార్టీ అధినేత ఫరూక్ అబ్దుల్లా వైఖరిని నిరసిస్తూ ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.
కేంద్ర ప్రభుత్వంతో ఒమర్ అబ్దుల్లా లొంగుబాటు ధోరణిని అవలంబిస్తున్నారని, జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి (ఆర్టికల్ 370) పునరుద్ధరణ, రాజకీయ ఖైదీల విడుదల వంటి ప్రధాన హామీల విషయంలో నేషనల్ కాన్ఫరెన్స్ పూర్తి రాజీ పడిందని రుహుల్లా మెహదీ తీవ్ర ఆరోపణలు చేశారు. అబ్దుల్లా కుటుంబం జమ్మూ కాశ్మీర్‌ను తమ సొంత జాగీరుగా భావిస్తోందని, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను విస్మరించి బీజేపీకి లొంగిపోయిందని ఆయన ఘాటుగా విమర్శించారు.
ఈ రాజీనామా పరిణామం జమ్మూ కాశ్మీర్‌లోని ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వంలోనూ, నేషనల్ కాన్ఫరెన్స్ వర్గాల్లోనూ తీవ్ర రాజకీయాన్ని వేడెక్కించింది.