విద్యార్థుల ఆరోగ్యానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు.
బ్రహ్మసముద్రం: విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ వసతి గృహాల్లో నివసిస్తున్న విద్యార్థులకు ఉచితంగా దీర్ఘకాలిక క్రిమిసంహారక దోమతెరలను పంపిణీ చేస్తోంది. దోమకాటు ద్వారా వ్యాపించే మలేరియా, డెంగ్యూ, చికున్‌గున్యా వంటి వ్యాధుల నుంచి విద్యార్థులను రక్షించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. జిల్లా మలేరియా అధికారి ఆదేశాల మేరకు బ్రహ్మసముద్రం వైద్యాధికారి డాక్టర్ రాజేష్ కుమార్ ఆధ్వర్యంలో మలేరియా సబ్‌యూనిట్ అధికారి తిరుపాలయ్య మండల కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గురుకుల బాలికల పాఠశాల, కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం, ప్రభుత్వ బాలుర వసతి గృహాల్లో విద్యార్థులకు ఉచితంగా దోమతెరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు దోమల ద్వారా వ్యాపించే వ్యాధులు, వాటి లక్షణాలు, నివారణ చర్యలపై అవగాహన కల్పించారు. మలేరియా, డెంగ్యూ, చికున్‌గున్యా వంటి వ్యాధులు ప్రజారోగ్యానికి ముప్పుగా పరిణమిస్తున్న నేపథ్యంలో దోమకాటు నివారణపై ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న దీర్ఘకాలిక క్రిమిసంహారక దోమతెరలను విద్యార్థులు ప్రతిరోజూ రాత్రి నిద్రించే సమయంలో తప్పనిసరిగా ఉపయోగించాలని, వాటిని జాగ్రత్తగా భద్రపరుచుకోవాలని తెలిపారు. వసతి గృహాల పరిసరాల్లో ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా చూడాలని, నీటి నిల్వ పాత్రలను తరచూ శుభ్రం చేయాలని, పనికిరాని కొబ్బరి చిప్పలు, పాత టైర్లు, ఖాళీ డబ్బాల్లో వర్షపు నీరు నిల్వ ఉండకుండా తొలగించాలని సూచించారు. దోమలు వృద్ధి చెందడానికి అనుకూలమైన పరిస్థితులను నివారించడం ద్వారా వాటి వ్యాప్తిని అరికట్టవచ్చని వివరించారు. విద్యార్థుల్లో జ్వరం, చలి, వణుకు, తలనొప్పి, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే సమీప ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించి వైద్య పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. జ్వరాన్ని సాధారణ సమస్యగా భావించి సొంతంగా మందులు వినియోగించకుండా వైద్యుల సూచన మేరకు చికిత్స పొందాలని స్పష్టం చేశారు. వసతి గృహాల నిర్వాహకులు విద్యార్థుల ఆరోగ్యం, భద్రత విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని, పరిసరాల పరిశుభ్రతను నిరంతరం పర్యవేక్షించాలని కోరారు. ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న దోమతెరలను ప్రతి విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలని, వ్యక్తిగత పరిశుభ్రతతోపాటు పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. వ్యాధులు వచ్చిన తర్వాత చికిత్స పొందడం కంటే ముందస్తు జాగ్రత్తలు పాటించడం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సత్యవతమ్మ, కేజీబీవీ ఇన్‌చార్జి ఎస్‌ఓ జ్యోతి, హాస్టల్ వెల్ఫేర్ అధికారి శ్రీనివాసులు, ఫిజికల్ డైరెక్టర్ సంగీత, హెల్త్ అసిస్టెంట్లు జాన్సన్, ప్రతాప్ రెడ్డి, మురళీకృష్ణ, నారాయణ, ఆనంద్, ఆశా కార్యకర్తలు రామలక్ష్మి, ప్రేమక్క తదితరులు పాల్గొన్నారు.
కళ్యాణదుర్గం టౌన్ రిపోర్టర్ :- బోయ రంగస్వామి.