ఇండియా కూటమి కీలక భేటీ.. ఎస్ఐఆర్ పై పోరాటాన్ని ఉధృతం చేయాలని నిర్ణయం
దిల్లీ:లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నివాసంలో జరిగిన విపక్ష ఎంపీల సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎస్ఐఆర్ (SIR) అంశంపై ఢిల్లీ నుంచి గల్లీ దాకా పోరాటాన్ని ఉధృతం చేయాలని ఈ భేటీలో నిర్ణయించారు. అయితే, త్వరలో దసరా, దీపావళి పండగలు వస్తున్న నేపథ్యంలో నిరసనలకు తాత్కాలికంగా బ్రేక్ ఇవ్వాలని భావిస్తున్నారు. పండగలు ముగిసిన తర్వాత ఆందోళనలను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై కూటమి నేతలు చర్చించారు. సోమవారం నిర్వహించిన నిరసనకు వచ్చిన స్పందనపై ఈ సమావేశంలో విశ్లేషణ చేపట్టారు. అలాగే సుప్రీంకోర్టుకు వినతిపత్రం సమర్పించిన తర్వాత చోటుచేసుకున్న పరిణామాలపై కూడా చర్చించారు. మరోవైపు, ఈ కీలక సమావేశానికి ఆప్ దూరంగా ఉండటంపై కూటమి నేతల్లో అసంతృప్తి వ్యక్తమైనట్లు సమాచారం.