చాకలి ఐలమ్మ విగ్రహ ధ్వంసంపై అశ్వారావుపేట రజక సంఘం ఖండన
చాకలి ఐలమ్మ విగ్రహ ధ్వంసంపై అశ్వారావుపేట రజక సంఘం ఖండన
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, మహిళా చైతన్యానికి ప్రతీక, పేదల హక్కుల కోసం పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహాన్ని మెదక్ లో ధ్వంసం చేయడాన్ని అశ్వారావుపేట రజక సంఘం తీవ్రంగా ఖండించింది. సమాజానికి స్ఫూర్తినిచ్చే మహనీయుల విగ్రహాలను ధ్వంసం చేయడం దుర్మార్గమైన చర్య అని సంఘం ప్రతినిధులు పేర్కొన్నారు.
చాకలి ఐలమ్మ తన ధైర్యసాహసాలతో భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా పోరాడి, అణగారిన వర్గాల హక్కుల సాధనకు కృషి చేశారని గుర్తుచేశారు. ఆమె పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని, అలాంటి మహనీయురాలి విగ్రహాన్ని ధ్వంసం చేయడం యావత్ సమాజాన్ని అవమానించడమేనని అన్నారు.
తెలంగాణ చరిత్రలో చాకలి ఐలమ్మకు ప్రత్యేక స్థానం ఉందని, ఆమె త్యాగాలు, పోరాటాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని తెలిపారు. మహనీయుల విగ్రహాలు కేవలం విగ్రహాలు మాత్రమే కాదని, అవి సమాజానికి మార్గదర్శకమైన చరిత్రకు, పోరాట స్ఫూర్తికి ప్రతీకలని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులను గుర్తించి కఠినంగా శిక్షించాలని అశ్వారావుపేట రజక సంఘం డిమాండ్ చేసింది. మహనీయుల విగ్రహాలకు రక్షణ కల్పించడంతో పాటు, సామాజిక సామరస్యాన్ని దెబ్బతీసే చర్యలను అరికట్టాలని ప్రభుత్వాన్ని, పోలీసు అధికారులను కోరింది.
వీరనారి చాకలి ఐలమ్మ ఆశయాలను కొనసాగిస్తూ, ఆమె పోరాట స్ఫూర్తిని భావితరాలకు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని రజక సంఘం ప్రతినిధులు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో బ్రతక సంఘం ప్రెసిడెంట్ బుక్కూరి బుజ్జిబాబు, వైస్ ప్రెసిడెంట్ గుమ్మడి ఆదినారాయణ, సెక్రటరీ గాడిచర్ల శ్రీను, ప్రచార కార్యదర్శి పల్లంటి రాంసాయి, సంఘం నాయకులు పోతిరెడ్డిపల్లి వెంకటేశ్వరరావు, పోతిరెడ్డిపల్లి నరసింహారావు, టేకి చిన్న, తలుపుల నాగేశ్వరరావు, గుమ్మడి అప్పన్న, రాయల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
సూర్య ప్రతినిధి మునీర్ అశ్వారావుపేట