కనకదుర్గమ్మకు రూ.75 లక్షల విలువైన స్వర్ణ కిరీటం బహూకరణ
ఇంద్రకీలాద్రి, మేజర్ న్యూస్: ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా గురువారం శ్రీ కనకదుర్గమ్మవారికి రూ.75 లక్షల విలువైన స్వర్ణ కిరీటాన్ని భక్తిశ్రద్ధలతో సమర్పించారు. శ్రీకాకుళం పట్టణానికి చెందిన కూర్మినాయుడు, పద్మావతమ్మ దంపతుల కుమారుడు కె. దుర్గా శ్రీనివాస్ 494 గ్రాముల బరువున్న నవరత్న ఖచిత బంగారు కిరీటాన్ని అమ్మవారికి కానుకగా అందజేశారు. ఎరుపు, నీలం, తెలుపు, పచ్చ రంగుల రాళ్లతో సర్వాంగసుందరంగా రూపొందించిన ఈ కిరీటాన్ని దేవస్థానం కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్, దసరా చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ వి. త్రినాథరావు సంయుక్తంగా స్వీకరించారు. అనంతరం దాత కుటుంబ సభ్యులకు అంతరాలయంలో అమ్మవారి ప్రత్యేక దర్శనం కల్పించారు. వేదపండితులు వేదాశీర్వచనం అందించగా, అధికారులు అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదాలను అందజేసి సత్కరించారు. ఈ సందర్భంగా దాత కె. దుర్గా శ్రీనివాస్ మాట్లాడుతూ, కనకదుర్గమ్మ కృపతోనే ఈ స్వర్ణ కిరీటాన్ని సమర్పించుకునే భాగ్యం కలిగిందని, పవిత్రమైన దసరా శరన్నవరాత్రుల సమయంలో ఈ అవకాశం కల్పించిన ఆలయ ఈవోకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.