కిరాతక భార్య, ప్రియులకు ఉరిశిక్ష
మీరట్:దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన 'బ్లూ డ్రమ్' హత్య కేసులో ఉత్తరప్రదేశ్ మీరట్ జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. భర్త సౌరభ్ రాజ్‌పుత్‌ను అతికిరాతకంగా హత్య చేసిన నిందితులు ముస్కాన్ రస్తోగి, ఆమె ప్రియుడు సాహిల్ శుక్లాలకు కోర్టు ఉరిశిక్ష (మరణశిక్ష) విధించింది.
సౌరభ్ రాజ్‌పుత్‌ను హతమార్చిన అనంతరం అతని మృతదేహాన్ని ముక్కలుగా నరికి, బ్లూ డ్రమ్‌లో పెట్టి సిమెంట్, ఇసుకతో నింపేసి దాచిపెట్టారు. ఈ అత్యంత దారుణమైన కేసులో పోలీసులు దాదాపు 1,000 పేజీల ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేయగా, విచారణలో భాగంగా కోర్టు 22 మంది సాక్షులను విచారించింది. ఆధారాలను పరిశీలించిన న్యాయస్థానం.. సమాజంలో ఇటువంటి హేయమైన నేరాలకు తావులేదని పేర్కొంటూ నిందితులకు ఉరిశిక్ష ఖరారు చేస్తూ చారిత్రాత్మక తీర్పునిచ్చింది.