కేశంపేట మండలంలో గంజాయి లభ్యం....
*33 గ్రాముల పదార్థం స్వాధీనం*
*వేముల నర్వ శివారులోని స్టోన్ క్రషర్ గదిలో పోలీసుల తనిఖీలు..*
*ఒకరిపై కేసు నమోదు*
రంగారెడ్డి జిల్లా కేశంపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని వేముల నర్వ గ్రామ శివారులో గంజాయి కలకలం చోటుచేసుకుంది. ఆర్కాన్ మినరల్స్ స్టోన్ క్రషర్ ప్రాంగణంలోని ఓ గదిలో గంజాయి ఉన్నట్లు అందిన సమాచారంతో పోలీసులు తనిఖీలు నిర్వహించి, సుమారు 33 గ్రాముల గంజాయిగా అనుమానిస్తున్న పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన రామకృష్ణ పటేల్ (31)పై కేసు నమోదు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 13వ తేదీ సాయంత్రం షాద్నగర్కు చెందిన సబ్ ఇన్స్పెక్టర్ అడ్డాకుల శ్రీకాంత్, పోలీసు సిబ్బంది, క్లూస్ బృందం, పంచ సాక్షులతో కలిసి స్టోన్ క్రషర్ ప్రాంగణంలోని ఓ గదిలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా గది గోడకు వేలాడదీసిన నల్లటి కవర్లో ఎండిన ఆకులు, పువ్వుల మాదిరిగా ఉన్న పదార్థాన్ని గుర్తించారు. అదే గదిలో నివసిస్తున్న రామకృష్ణ పటేల్ వద్ద లభించిన ఈ పదార్థాన్ని పంచ సాక్షుల సమక్షంలో స్వాధీనం చేసుకున్నారు. దాని నికర బరువు సుమారు 33 గ్రాములుగా గుర్తించారు. ఈ ఘటనపై కేశంపేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాగా, ఎస్ఐ బి. పరమేష్ దర్యాప్తు చేపట్టారు. గంజాయి, ఇతర మాదకద్రవ్యాల అక్రమ నిల్వ, రవాణా, విక్రయాలు, వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిస్తే పోలీసులకు తెలియజేయాలని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రజలు సహకరించాలని కోరారు.
జవాజి రాఘవేందర్ గౌడ్ : మేజర్ న్యూస్, షాద్ నగర్.