andhrapradesh
వీఆర్ఏల సమస్యలను వెంటనే పరిష్కరించాలి సీపీఎం జిల్లా కార్యదర్శి వై. సింహారావు డిమాండ్
అవనిగడ్డ, మేజర్ న్యూస్: గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్ఏ) న్యాయమైన సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వై. సింహారావు డిమాండ్ చేశారు. తమ సమస్యల పరిష్కారం కోరుతూ గత 29 రోజులుగా అవనిగడ్డ తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో రిలే నిరాహార దీక్షలు చేస్తున్న వీఆర్ఏల శిబిరాన్ని సీపీఎం నాయకులు బుధవారం సందర్శించి సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా సింహారావు మాట్లాడుతూ.. గ్రామాల్లో వీఆర్ఏలు ఇప్పటికీ తీవ్ర పని ఒత్తిడితో పాటు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. గతంలో సీపీఎం ఎమ్మెల్యే నర్రా రాఘవరెడ్డి కృషితో వీఆర్ఏలు మెరుగైన జీవనానికి అవసరమైన కొన్ని హక్కులను సాధించుకున్నారని గుర్తుచేశారు. ప్రస్తుత జీవన ప్రమాణాలకు అనుగుణంగా వారి వేతనాలు, ఇతర సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
గత ప్రభుత్వాలు ఉద్యోగులు సమ్మె చేసినప్పుడు స్పందించేవని, ప్రస్తుత ప్రభుత్వం మాత్రం సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగులపై ప్రజలను రెచ్చగొట్టే ధోరణి సరికాదన్నారు. గ్రామస్థాయిలో వీఆర్ఏల సేవలు ఎంతో అవసరమని, వారి న్యాయమైన డిమాండ్లను నెరవేర్చేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకు సీపీఎం, సీఐటీయూ వీఆర్ఏలకు అండగా ఉంటాయని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు శీలం నారాయణరావు, వీఆర్ఏల సంఘం మండల అధ్యక్షుడు దొవారి ముసలయ్య, కార్యదర్శి మునిపల్లి నాగేశ్వరరావు, వీఆర్ఏలు పాల్గొన్నారు.✍️ శ్రీనివాస్, అవనిగడ్డ, కృష్ణాజిల్లా.