కూకట్పల్లిలో గంజాయి కలకలం
హైదరాబాద్:నగరంలోని కూకట్పల్లి ప్రాంతంలో గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని ఎక్సైజ్ సిబ్బంది రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. కూకట్పల్లిలో ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా గంజాయి అమ్మకాలు జరుపుతున్న ఎం.శ్రవణ్ కుమార్ అనే నిందితుడిని ఎక్సైజ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
నిందితుడి వద్ద నుంచి సుమారు 325 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. పట్టుబడిన నిందితుడిని, స్వాధీనం చేసుకున్న గంజాయిని కూకట్పల్లి ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించినట్లు ఈ.ఎస్.ఆర్. ప్రవీణ్ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎక్సైజ్ అధికారులు పేర్కొన్నారు. యువతను పెడదోవ పట్టించేలా గంజాయి వంటి మత్తు పదార్థాలు విక్రయిస్తున్న వారిపై నిఘా మరింత కఠినం చేశామని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.