డిండి ప్రాజెక్టును అడ్డుకోవడం సరికాదు
నల్లగొండ, సూర్య బ్యూరో :డిండి ఎత్తిపోతల పథకం నుంచి సాగునీటి విడుదల విషయంలో పాలకులు, నేతలు, అధికారులు సంకుచితంగా ఆలోచించడం సరికాదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి హితవు పలికారు. నల్లగొండలోని తన నివాసంలో మీడియాతో చిట్ చాట్ సందర్భంగా ఆయన పలు కీలక విషయాలపై స్పందించారు.
డిండి ఎత్తిపోతల ప్రాజెక్టును అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇది మంచి పరిణామం కాదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ధోరణులు రాష్ట్ర సమగ్రతకు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు. కేబినెట్లో డిండి ప్రాజెక్టుకు అనుమతులు లభించిన తర్వాత వివాదాలకు తెరలేపడం సమంజసం కాదన్నారు. నల్లగొండ జిల్లాలోని ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాల విముక్తి కోసమే డిండి ప్రాజెక్టును రూపొందించుకున్నామని, తెలంగాణ తెచ్చుకున్నది జిల్లాల మధ్య పంచాయతీలు పెట్టుకోవడానికి కాదని స్పష్టం చేశారు.
మహబూబ్నగర్లో ప్రొఫెసర్ కోదండరాం, హరగోపాల్ చేసిన వ్యాఖ్యలు సరికావని గుత్తా సుఖేందర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. జిల్లాల మధ్య జల వివాదాలను సృష్టించడం తగదని, సీఎం రేవంత్ రెడ్డి వెంటనే జోక్యం చేసుకుని రెండు జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి సమస్యను పరిష్కరించాలని కోరారు.
ఇదిలాఉంటే, రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగిందని, దానికి తగినట్లుగా బయటి మార్కెట్ నుంచి విద్యుత్ కొనుగోలు చేసే అవకాశం ప్రస్తుతానికి లేనందున... రాబోయే రబీ సీజన్లో రైతులు ఆరుతడి పంటలకే ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సూచించారు.